VASANTHOTSAVAMS CONCLUDES _ వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాలు

TIRUPATI, 19 MAY 2025: The annual three-day Vasanthotsavams concluded on a grand note in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on Monday.
 
During Snapana Tirumanjanam, Pancha Suktams were recited.
 
While in the evening Unjal Seva and Tiruveedhi Utsavam will be observed.
 
Spl. Gr. DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath and other temple staff, devotees were present.
 
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  
 

వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవాలు

తిరుపతి, 2025, మే 19: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.

వసంతోత్సవములు ప్రాముఖ్యత :

శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీవిశ్వావసు నామ సంవత్సరం, వైశాఖ మాసంలో త్రయాహ్నిక దీక్షతో ఈ మూడు రోజులు శ్రవణ నక్షత్రం నాడు పరిసమాప్తి అయ్యే విధంగా వసంతోత్సవ సేవ వేఖానసాగ మోక్తంగా వసంతోత్సవాలను నిర్వహిస్తారు. వసంత ఋతువులో ప్రకృతి ద్వారా ఆవిర్భవించిన ఫలములు, పుష్పములు స్వామికి సమర్పించి సర్వజగద్రక్షకుడిగా సర్వాంతర్యామిగా స్వామిని ప్రార్థించి ఆ శ్రీనివాసుని దివ్యానుగ్రహం పొందుటయే ఈ వసంతోత్సవం యొక్క అంతరార్థం.

ఉదయం 8.30 నుండి 9.00 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులు, శ్రీసీతారామ లక్ష్మణ, ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.

మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద్య నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలసూక్తం, విష్ణుసూక్తం, దశ శాంతి మంత్రములు, తైత్తరీయ ఉపనిషత్తు, దివ్య ప్రభందములో అభిషేక సమయంలో అనుసంధానము చేసే నిరాట్టమ పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు (వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, రోజా, మల్లె, సంపంగి, గులాబి, దవణం, తులసి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పి.వ‌ర‌ల‌క్ష్మీ, ఏఈవో శ్రీ ఎం.గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ వి.రమేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ డి.మునికుమార్, ఎం.ధోనీ శేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.