GIANT RADHOTSAVAM HELD _ వైభవంగా శ్రీవారి రథోత్సవం
43 FEET TALL 47 METRIC TONNES MAMOTH WOODEN CHARIOT GLIDES MAGESTICALLY
Tirumala, 01 October 2025: On the penultimate day of the ongoing annual Salakatla Brahmotsavams in Tirumala, Sri Malayappa Swamy, along with His consorts, Sridevi and Bhudevi glided along the four mada streets of Tirumala on Wednesday morning.
Thousands of devotees participated and pulled the divine chariot with utmost devotion.
Rathotsavam has been a traditional practice since ancient times. Rathotsavam is especially famous and is believed to bestow liberation, as described in sacred texts. Authorities ensured all safety measures during the procession.
Chariot signifies self-realization and the distinction between body and soul.
Prominent dignitaries including Tirumala Sri Pedda Jeeyar Swamy, Sri Chinna Jeeyar Swamy, TTD Chairman Sri B.R. Naidu, EO Sri Anil Kumar Singhal, JEO Sri Veerabrahmam, CV&SO Sri Murali Krishna, CE Sri Satyanarayana, engineering officials, and others participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
వైభవంగా శ్రీవారి రథోత్సవం
– భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు
– గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు
తిరుమల, 2025 అక్టోబరు 01: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.
బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.
అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది.
తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. ’రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే ’ అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.
రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృష్ణ,
ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.





























