RATHOTSAVAM HELD _ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం
Tirupati, 03 April 2025: The penultimate day during the ongoing annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple witnessed the procession of mammoth wooden chariot where scores of devotees participated.
Both the Pontiffs of Tirumala, DyEO Smt Nagaratna and others were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం
తిరుపతి, 2025 ఏప్రిల్ 03: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 9.15 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు. రథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన తరువాత ప్రబంధం, వేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే.
మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా జరగనుంది.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 4న చక్రస్నానం
శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.