వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం

వైభవంగా శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరుస్వామివారి స్నపన తిరుమంజనం

శ్రీవారి అనుగ్రహంతో పులకిస్తున్న భక్తులు

తిరుపతి,  2020 ఫిబ్రవరి 17: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) నాలుగో రోజైన సోమ‌వారం శోభాయమానంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
         
ప్రధాన కంకణభట్టర్‌ శ్రీ శేషాచార్యులు, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం  నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు.
       
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్యప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో వివిధ రకాల సాంప్ర‌దాయ పూలు, రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
       
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు, ప్రధాన అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.