CHAKRASNANAM MARKS THE CONCLUSION OF NAVARATRI BRAHMOTSAVAMS _ శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం

TIRUMALA, 23 OCTOBER 2023: The nine-day religious Navaratri Brahmotsavams concluded on a grand not with the sacred Chakra Snanam on Monday.

Earlier, the processional deities of Sri Malayappa along with His two consorts Sridevi and Bhudevi accompanied by Sri Sudarshana Chakrattalwar were taken to the Swamy Pushkarini adjacent to the Sri Bhuvaraha Swamy temple. After rendering the holy Snapana Tirumanjanam to the Utsava deities amidst the chanting of Veda Mantras, the anthropomorphic form of Srivaru was immersed in the waters of the temple tank.

The pilgrims who were waiting for the auspicious moment also took holy dip in the sacred waters chanting Govind Nama with utmost devotion and elation.

Both the Pontiffs of Tirumala, TTD Chairman Sri Karunakara Reddy, EO Sri Dharma Reddy and other board members, TTD officials, dignitaries, district officials were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని శ్రీ చ‌క్ర తిరుమంజ‌నం

– చ‌క్ర‌స్నానంతో ముగిసిన శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

– అక్టోబ‌రు 24న పార్వేట ఉత్సవం –

తిరుమల, 2020 అక్టోబ‌రు 24: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ముగిశాయి.

అంతకుముందు తెల్లవారుజామున 4 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామివారి శిష్య‌బృందం పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

చక్రస్నానం – లోకం క్షేమం

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.
ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవయజ్ఞఫలం లభిస్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌ణ క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, ప‌లువురు బోర్డు స‌భ్యులు, జెఈవోలు శ్రీమ‌తి స‌దాభార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అక్టోబ‌రు 24న పార్వేట ఉత్సవం –

అక్టోబ‌రు 24వ తేదీ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి పార్వేట ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. అధికమాసం కారణంగా నిర్వహించే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల మరుసటిరోజు కూడా ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.