TTD CHAIRMAN RELEASES PUBLICITY MATERIAL _ శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు

VONTIMITTA, 09 MARCH 2025: TTD Trust Board Chairman Sri BR Naidu along with JEO Sri Veerabrahmam released wall posters, pamphlets related to Vontimitta Brahmotsavam on Sunday at Kadapa district.

This event took place at the temple premises. Later on the Chairman along with TTD and district officials also inspected Kalyana Vedika, other ongoing arrangements for the annual fete which is set to commence from April 06 onwards. The chairman called on the devotees to take part in the annual festival and beget the divine blessings.

Meanwhile the construction of the ancient temple of Sri Kodanda Ramalayam was believed to have commenced in the 14th century and lasted upto 17th century with various developments.

Named after two thieves turned ardent devotees Ontadu and Mittadu, the construction of the temple was commenced by Sri Bhukkaraualu in 1356AD of Vijayanagara dynasty as per available inscriptions.

TTD officials were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు
 
ఒంటిమిట్ట / తిరుపతి, 2025  మార్చి 09: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టిటిడి చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం  ఈ కార్యక్రమం జరిగింది.
 
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 6న శ్రీరామనవమి – పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్‌ 9న హనుమంత వాహనం, ఏప్రిల్‌ 10న గరుడవాహనం, ఏప్రిల్‌ 11న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్‌ 12న రథోత్సవం జరుగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.  
 
ఆలయ చరిత్ర : 
 
పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది. శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.
 
శాసనాల ప్రకారం : 
 
ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు. వీరిరువురి కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటుచేస్తాడు. క్రీ.శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు. 
 
ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాళం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలికొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు.
 
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ గోవింద రాజన్, సీపీఆర్వో డా. టి.రవి, ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, వీజీవో శ్రీమతి సదాలక్ష్మి, ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీ రామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. 
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.