శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ దాతలకు  ఇక బహుమానం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ దాతలకు  ఇక బహుమానం

తిరుపతి, జూన్‌ 20, 2013: శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి విరాళాలు అందించే దాతలకు ఇకపై బహుమానం అందించాలని తితిదే నిర్ణయించింది.
 
రూ.లక్ష నుండి రూ.5 లక్షల వరకు విరాళాలు అందించే దాతలకు ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా అందిస్తారు. రూ.5 లక్షలపైన విరాళం అందించే దాతలకు సంవత్సరంలో ఒకసారి(ఇద్దరికి మాత్రమే) ఏదైనా ఒక వారాంతపు సేవలో పాల్గొనే అవకాశంతో పాటు ఒక ఉత్తరీయం, ఒక రవికె బహుమానంగా అందజేస్తారు. ఆలయంలో మంగళవారం స్వర్ణ పుష్పార్చన, బుధవారం శతకలశాభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకంను వారపు సేవలుగా నిర్వహిస్తారు.
 
నగదు విరాళం అందించాలనుకునేవారు తితిదే కార్యనిర్వహణాధికారి పేరిట డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీయాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అందించాలనుకునేవారు శ్రీనివాసమంగాపురంలోని స్వామివారి ఆలయంలో నేరుగా అందజేయవచ్చు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.