శ్రీవారిమెట్టు ద్వారా తిరుమలకు వెళ్ళేభక్తులకు సౌకర్యాలు

శ్రీవారిమెట్టు ద్వారా తిరుమలకు వెళ్ళేభక్తులకు సౌకర్యాలు

తిరుపతి, ఏప్రిల్‌-9,2009: తిరుపతి నుండి తిరుమలకు గల కాలినడక దారిలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను శ్రీవారిమెట్టు ద్వారా తిరుమలకు వెళ్ళేభక్తులకు కల్పించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి డా||కె.వి.రమణాచారి చెప్పారు. గురువారం ఉదయం ఆయన శ్రీవారిమెట్టు వద్ద గల పాదాలమండపం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారిమెట్టు ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులకు తితిదే శ్రీనివాసం నుండి ఉచితబస్సు సౌకర్యం కల్పిస్తున్నదని, రక్షణ, త్రాగునీటి వసతిని కల్పించామని తెలిపారు. ఈ మార్గంలో మొత్తం మెట్ల సంఖ్య 2,388 కాగా దూరం 2.1 కిలోమీటరు ఉన్నదని, భక్తులు పెద్ద సంఖ్యలో ఈ దారిలో సైతం తిరుమలకు చేరుకోవచ్చని చెప్పారు. నారాయణవనంలో వివాహానంతరం శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారితో కలసి ఈ కొండమెట్ల ద్వారా తిరుమలకు చేరుకున్నాడని, స్వామివారు తొలుత పాదంమోపిన పవిత్ర ప్రదేశం గనుక ఇది శ్రీవారిమెట్టు అయిందని ఆయన అన్నారు.

అంతకు మునుపు రు.38లక్షలతో (ముప్పయ్‌ ఎనిమిది లక్షలు)నిర్మించిన శ్రీవారిపాదాలమండపమును, రు.6కోట్లతో నిర్మించిన భక్తులకై షెల్టర్‌ (దారిపొడవునా)ను ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తితిదే ప్రత్యేకాధికారి శ్రీఏ.వి.ధర్మారెడ్డి, ముఖ్యభద్రతాధికారి శ్రీపి.వి.ఎస్‌ రామకృష్ణ, ఛీఫ్‌ ఇంజనీరు శ్రీ వి.ఎస్‌.బి.కోటేశ్వరరావు, స్థానికాయలయాల డిప్యూటీ ఇ.ఓ శ్రీవాసుదేవన్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.