శ్రీవారి ఆలయంలో రేపు శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో రేపు శ్రీరామనవమి ఆస్థానం
తిరుమల, 2010 మార్చి 23: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 24వ తేదిన శ్రీరామనవమి ఆస్థానం, 25వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం కన్నుల పండుగగా జరుగుతుంది.
మార్చి 24వ తేదిన శ్రీవారి ఆలయంలో సహస్రకలశాభిషేకం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దుచేశారు.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున బంగారు వాకిలి ముందు శ్రీరాముల వారికి ఆస్థానం జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు తిరువీధులలో ఊరేగుతారు. తరువాత బంగారు వాకిలి వద్ద సర్వభూపాల వాహనంలో వేంచేయబడిన శ్రీ సీతారామ లక్ష్మణులకు, హనుమంతుల వారికి ఆస్థానం, నివేదనలు, అక్షతారోపణ జరిగిన తర్వాత శ్రీ రామాయణంలోని శ్రీ రామ జన్మ వృత్తాంతం పురాణ ప్రవచనం జరుగుతుంది. పిదప మంగళ నీరాజనాలతో ఆస్థానం ముగుస్తుంది.
ప్రతి సంవత్సరం ఛైత్రశుద్ద థమి రోజు సాయంత్రం తిరుమల పురవీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణులకు అభిముఖంగా మరొక పీఠంపై ఆంజనేయస్వామివార్లను ఊరేగిస్తారు.
పిదప బంగారు వాకిలి ముందు సీతారామలక్ష్మణులు వీరికి ప్రక్కన ఒక్కొక్క పీఠంపై సుగ్రీవ, అంగద, హనుమంతులను వేంచేపు చేసిన తర్వాత ఆస్థానం జరుగుతుంది. అక్షతారోపణ నివేదన కార్యక్రమాల అనంతరం శ్రీరామ జననం, పట్టాభిషేకం ప్రవచనం వుంటుంది. అటు తరువాత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.