VETURI SPREAD SRIVARI GLORY – SCHOLARS _ శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి- ఆచార్య సర్వోత్తమరావు
Tirupati,29 August 2024: The scholars univocally advocated the great contributions of late Sri Veturi Prabhakara Shastry who brought to the limelight the glory of Sri Venkateswara Swamy with his literary works.
Acharya Purushottam Rao, retired Telugu pundit of SV University hailed the contributions of Sri Sri Veturi on the later’s 74th death anniversary fete held at Annamacharya Kalamandiram in Tirupati on Thursday.
Acharya Sarvottama Rao, retired Telugu department HoD in SVU, Sri Venugopal of Sri Veturi Prabhakara Shastry Mitra Mandali, Acharya Kattamanchi Lakshmi, SV University retired professor paid rich tributes to Veturi literary contributions.
Dr Narasimhacharyulu, sub-editor in the TTD publications department said all sankeertans of Sri Annamacharya which were forgotten for 400 years were brought to light and translated to Telugu by Sri Veturi.
Earlier floral tributes were paid for the bronze life-size statue of Sri Veturi Prabhakara Shastry in front of the SVETA building.
Annamacharya Project Superintendent Sri Kumar, Sri Loknath Reddy, Smt Kokila of HDPP and other literary lovers of Tirupati were also present.
శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి- ఆచార్య సర్వోత్తమరావు
తిరుపతి, 2024 ఆగస్టు 29: తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి అని ఎస్వీయు తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య సర్వోత్తమరావు అన్నారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 74వ వర్థంతిని గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు మాట్లాడుతూ, ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు. ఆయన పద్య సాహిత్యంతోపాటు కథలు, కథానికలు కూడా రచించారని వివరించారు.
శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి మిత్ర మండలి శ్రీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఆంధ్ర వాఙ్మయ విస్తృతికి వేటూరి వారు ఎంతో కృషి చేశారని, గ్రంథ విమర్శనలో ఆయనకు మరెవరూ సాటి రారని చెప్పారు. ఆయన రచించిన “నీతి-నిధి” పుస్తకాన్ని ప్రతి ఒక్కరు చదవాలని, అందులో ప్రతి ఒక్కరు దయ కలిగి ఉండాలని తెలియజేశారన్నారు. 98 శాతం వ్యాధులు మనస్సు నుండి ఉద్భవిస్తాయని, యోగం ద్వారా వ్యాధులు దూరం అవుతాయని వివరించారు.
ఎస్వీయూ తెలుగు విశ్రాంతాచార్యులు ఆచార్య కట్టమంచి మహాలక్ష్మి ప్రసంగిస్తూ, శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి తెలుగు భాషకు విశేష సేవలు చేశారన్నారు. ప్రాచీన రాగి రేకుల్లోని కీర్తనలను వెలుగు చూడటానికి బాటలు వేశారన్నారు. అన్నమయ్య కీర్తనలు వెలుగు చూశాక ఎంతోమంది ఆ కీర్తనలు ఆలపిస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. కవిగా, చరిత్ర పరిశోధకుడిగా, ప్రాచీనాంధ్ర సంకలన ప్రచురణకర్తగా, సంస్కృత రూపకానువాదకర్తగా, జానపద సాహిత్య ప్రోత్సాహకుడని వివరించారు.
ప్రచురణల విభాగం ఉప సంపాదకులు డా. నరసింహచార్యులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని తమ సంకీర్తనలతో అర్చించిన అన్నమయ్య సంకీర్తనలు అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత వేటూరివారిదన్నారు. 400 సంవత్సరాల పాటు మరుగున పడిపోయిన అన్నమయ్య సాహిత్యాన్ని శ్రీ వేటూరి వారు వెలుగులోకి తెచ్చారని తెలిపారు.
పుష్పాంజలి
ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుపతి శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి వేటూరిపీఠం పక్షాన పుష్పాంజలి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సూపరింటెండెంట్ శ్రీ కుమార్, శ్రీ లోకనాథరెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.