TTD CELEBRATED 129TH BIRTH ANNIVERSARY OF ALLURI SITARAMA RAJU _ ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ప్రతీక అల్లూరి సీతారామరాజు
Tirupati, July 4, 2026: TTD grandly celebrated the 129th birth anniversary of freedom fighter Alluri Sitarama Raju at Annamacharya Kalamandiram, Tirupati, on Saturday under the aegis of the Welfare Department.
Delivering the keynote address, social science teacher R. Mohan Rao Naidu described Alluri as a symbol of Andhra pride and said his sacrifice, courage, patriotism, and relentless fight for tribal rights continue to inspire generations of youth.
TTD Welfare Deputy EO Anandaraju called upon employees to imbibe Alluri’s spirit of selfless service, while Chief Audit Officer Venkateswarlu urged the youth to draw inspiration from the legendary freedom fighter’s bravery and dedication.
Floral tributes were paid to Alluri Sitarama Raju’s portrait, followed by special prayers, lighting of the ceremonial lamp, and remembrance of his invaluable contribution to India’s freedom struggle. TTD officials, employees, students, and representatives of employees’ unions participated in large numbers.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ప్రతీక అల్లూరి సీతారామరాజు
టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా 129వ జయంతి వేడుకలు
అల్లూరి త్యాగం, ధైర్యం, దేశభక్తి యువతకు శాశ్వత స్ఫూర్తి – ముఖ్య వక్త శ్రీ ఆర్. మోహన్‌రావు నాయుడు
తిరుపతి,2026జూలై 04: స్వాతంత్య్ర సమర చరిత్రలో చెరగని ముద్ర వేసిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని మన్యం జిల్లా సీతంపేటకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీ ఆర్. మోహన్‌రావు నాయుడు పేర్కొన్నారు.
టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఉదయం అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, దేశభక్తి భావాలతో ఘనంగా నిర్వహించారు.
గిరిజన హక్కుల కోసం వీరోచిత పోరాటం
ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న శ్రీ మోహన్‌రావు నాయుడు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలో ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు తీవ్ర దోపిడీ, అణచివేత, అన్యాయాలకు గురయ్యారని తెలిపారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గిరిజనులకు అండగా నిలిచిన అల్లూరి సీతారామరాజు వారిని ఏకం చేసి, దురలవాట్లకు దూరం చేసి, యుద్ధ విద్యలు, గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి బ్రిటిష్ పాలకులను ధైర్యంగా ఎదుర్కొన్న మహోన్నత నాయకుడని కొనియాడారు.
అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి ప్రతి యువకుడికి మార్గదర్శకమని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సేవా స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలి – డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు
టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు తన అసమాన త్యాగం, వీరోచిత పోరాటంతో మన్యానికి చిరస్థాయి కీర్తిని తీసుకువచ్చారని అన్నారు. ఆయన సేవా స్ఫూర్తిని ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో ఆచరణలో పెట్టాలని సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.
ధైర్యసాహసాలకు ప్రతిరూపం – చీఫ్ ఆడిట్ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు
టీటీడీ చీఫ్ ఆడిట్ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కులను కాపాడుతూ చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. నేటి యువత ఆయన ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలోని ప్రతి సవాలును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు.
భక్తిశ్రద్ధలతో నివాళులు
అంతకుముందు టీటీడీ సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పలువురు టీటీడీ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు అల్లూరి జీవితం, దేశభక్తి, స్వాతంత్య్ర సమరంలో ఆయన పోషించిన విశిష్ట పాత్రను స్మరించుకున్నారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది








