KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 26 June 2025: The traditional Temple cleaning ritual, the Koil Alwar Tirumanjanam was held with religious fervour in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Thursday.

This event was held in connection with the annual Sakshatkara Vaibhavotsavam which will commence on June 30 and concludes on July 2. 

The entire Temple premises were cleaned with Parimalam-an aromatic mixture.

Special Grade Deputy EO Smt Varalakshmi, AEO Sri Gopinath, Superintendent Sri Ramesh, Archakas and others participated in this unique cleansing fete.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2025, జూన్ 26: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 7 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఆలయ నేపథ్యం : ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ చిన తిరుమలయ్య పునరుద్ధరించినారు. ప్రకృతి వైపరీత్యాలకు యవనుల దండయాత్రలకు లోలై శిథిలమైన ఈ గుడి, గోపురాలను పునర్నిర్మించి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి నిత్యపూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చినతిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి, 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు సుందరాజ స్వామివారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానములు వారు చేపట్టి శ్రీవైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తులకు వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుండి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు.

సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూన్ 30వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు పెద్దశేష వాహనంపై, జూలై 01వ తేదీన రాత్రి 07 – 08 గం.ల వరకు హనుమంత వాహనంపై శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారు విహరించనున్నారు. జూలై 02వ సాయంత్రం 6.30 – 07.00 గం.ల మధ్య లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకురానున్నారు. అదే రోజు రాత్రి 07 – 08.30 గం.ల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

జూలై 03న పార్వేట ఉత్సవం

జూలై 03వ తేదీన ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూప‌రింటెండెంట్ శ్రీ రమేశ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునిశేఖర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ ధనశేఖర్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.