ANKURARPANAM HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 01 June 2025: Ankurarpanam for Sri Govindaraja Swamy Brahmotsavams was performed on Sunday evening in the temple in Tirupati.
The Dhwajarohanam will be observed between 07:02 am and 7:20am in the auspicious Mithuna Lagnam on June 02.
Both the Pontiffs of Tirumala, temple officials, were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2025, జూన్ 01: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం 5.30 – 8.00 గం.ల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.
జూన్ 02న ధ్వజారోహణం :
శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన జూన్ 02న సోమవారం ఉదయం 07.02 – 07.20 గం.లకు మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు.
ఆలయ నేపథ్యం – శ్రీగోవిందరాజస్వామి వారి ఐశ్వర్యాభివృద్ధి కొరకు వారి యొక్క దక్షిణ పార్శ్వమునందు ఒక గుడిలో ఆండాళ్ అను గోదాదేవిని కూడా ప్రతిష్ట చేయించిరి. దేశాధిపతియగు యాదవ భూపాలుడు ఈ ఆలయ ప్రాంతమునకు “రామానుజపురం” అని నామ ధేయముంచి, శ్రీరామానుజాచార్యులవారి దివ్యాజ్ఞ మేరకు, శ్రీ గోవిందరాజ స్వామి వారికి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి వలె, నిత్యోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాదులను చేయుచుండెను. తదుపరి నాటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉత్సవాలను క్రమంగా నిర్వహిస్తున్నారు. శ్రీగోవిందరాజస్వామి వారి ప్రాంగణంలో శ్రీ పార్థసారధిస్వామి వారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ పుండరీకవల్లి (మహాలక్ష్మి) అమ్మవారు, సుదర్శన చక్రత్తాళ్వార్ సన్నిధి, భగవద్రామానుజులవారి సన్నిధి, తిరుమలనంబి, అనంతాళ్వారులు, ఆళ్వార్ల సన్నిధులు మున్నగు ఉప ఆలయాలు చోటు చేసుకున్నవి. అందువల్లే ఆలయాల సముదాయంగా శ్రీగోవిందరాజ స్వామివారి ఆలయం ప్రధానంగా వెలిసి యున్నది.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
వాహన సేవలు వివరాలు:
02వ తేదీ రాత్రి 07 గం.లకు పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
03.06. 2025 – ఉ. – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం
04.06. 2025 – ఉ. – ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం
05.06. 2025 – ఉ. – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం
06.06. 2025 – ఉ. – మోహినీ అవతారం, రాత్రి – గరుడ వాహనం
07.06. 2025 – ఉ. – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనం
08.06. 2025 – ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం
09.06. 2025 – ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహనం
10.06. 2025 – ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఏఈవో శ్రీ కె. ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ లు శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ రావు, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది