PUSHPAYAGAM HELD _ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కన్నులపండుగగా పుష్పయాగం
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కన్నులపండుగగా పుష్పయాగం
తిరుపతి, 2024 జూన్ 14: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
ఆలయంలో మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది.
ఇందులో మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 12 రకాల సాంప్రదాయ పుష్పాలు, తులసి, మరువం, దమనం, బిల్వం, పన్నీరాకు పత్రాలు కలిపి మొత్తం 3 టన్నులతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఈ పుష్పాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాతలు విరాళంగా అందించారు.
సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ శ్రీ జనార్దన్ రెడ్డి, ఏఇవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.