శ్రీరంగం వైష్ణవుల సేవలు అమోఘం: టిటిడి ఈవో

శ్రీరంగం వైష్ణవుల సేవలు అమోఘం: టిటిడి ఈవో

శ్రీ పద్మావతి అమ్మవారి వాహ‌న‌సేవ‌లో తరిస్తున్న శ్రీ రంగం శ్రీ‌వైష్ణ‌వులు

వాహన సేవల బేరర్లను సన్మానించిన టిటిడి ఈవో

తిరుపతి, 2024 డిసెంబరు 05: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం వాహన సేవలలో 2.5 టన్నుల బరువు ఉన్న వాహనాన్ని మోస్తున్న శ్రీరంగం శ్రీవైష్ణవులను గురువారం 10 గ్రాముల శ్రీవారి వెండి డాలర్, స్వామి వారి ప్రసాదాలతో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు సన్మానించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీవైష్ణవ సంప్రదాయపరులు గత 32 ఏళ్లుగా విశేష సేవలు అందిస్తున్నారన్నారు. ఒక్కో వాహనానికి మర్రి ఊడలతో తయారు చేసిన 28 అడుగుల పొడువైన 4 తండ్లు, కొయ్యతో తయారు చేసిన రెండు అడ్డ పట్టీలు, గొడుగు పలకలు, ఇద్దరు అర్చకులు, గొడుగులు పట్టుకునేందుకు మరో ఇద్దరు ఉంటారన్నారు. వీటి అన్నింటినీ కలిపితే ఒక్కో వాహనం దాదాపు 2.5 టన్నులకు పైగా బరువు ఉంటుందని తెలిపారు. ఉదయం, రాత్రి వాహనసేల్లో ఒక్కో వాహన సేవలో దాదాపు మూడు గంటలు పాటు బరువును మోస్తూ వాహన బ్యారర్లు తమ భక్తి భావాన్ని చూపుతూ, వాహన బ్యారర్ల తమ భుజాలు మీద మోయడం మూలంగా భుజంపై ఉబ్బి కాయ కాసినా ఏ మాత్రం సంకోచించకుండా అమ్మవారి సేవలో తరిస్తున్నారన్నారు. మొదట్లో నాకు కొంత సంకోచం ఉండేదని, అంత బరువును మోస్తున్నారా అనే అనుమానం ప్రత్యక్షంగా చూశాక నివృత్తి అయిందన్నారు. ఇదే అంశాన్ని జాతీయ, ప్రాంతీయ మీడియాతో పాటు ఎస్వీబీసీ ప్రపంచానికి తెలిసేలా కథనాలు రాశారన్నారు.

వాహన బేరర్లు అందరూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటి రంగంలోను, రైల్వే ఉద్యోగులు, బ్యాంక్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా పని పనిచేస్తున్నారని, వీరితోపాటు విద్యార్థులు కూడా ఉన్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, అన్నప్రసాదం స్పెషల్ ఆఫీసర్ శ్రీ జీఎల్ఎన్ శాస్త్రీ ఇతర శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.