శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి ఉపకులపతిగా ఆచార్య రాణీ సదాశివమూర్తి బాధ్యతలు స్వీకరణ

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి ఉపకులపతిగా ఆచార్య రాణీ సదాశివమూర్తి బాధ్యతలు స్వీకరణ

తిరుప‌తి, 2023 అక్టోబ‌రు 11: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి పూర్తిస్థాయి (రెగ్యులర్) ఉపకులపతిగా ఆచార్య రాణీ సదాశివమూర్తిని విశ్వవిద్యాలయ చాన్సలర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ నియమించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో వారు బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆచార్య రాణీ సదాశివమూర్తి మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతిగా అవకాశం రావడం స్వామి అనుగ్రహంగా, నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌ. అబ్దుల్ నజీర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా పాలకమండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డికి, టీటీడీ ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రపంచంలోనే వేదాల అధ్యయనం, పరిశోధన కోసం ఉన్నటువంటి ఏకైక విశ్వవిద్యాలయమని, దీనికి ప్రత్యేక స్థానం ఉందని తెలియజేశారు. విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు. వేదాల పరిశోధన, తాళపత్రాల పరిశోధన, సంరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఏవి రాధేశ్యామ్, అకడమిక్ డీన్ శ్రీ గోళి సుబ్రహ్మణ్య శర్మ, ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీ అంజిరెడ్డి, పీఆర్వో డాక్టర్ టి.బ్రహ్మాచార్యులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.