సంకీర్తనల ద్వారా భగవంతున్ని సేవించటం సులభం
సంకీర్తనల ద్వారా భగవంతున్ని సేవించటం సులభం
తిరుపతి, 2010 జనవరి 07: సంకీర్తనల ద్వారా భగవంతున్ని సేవించటం సులభమన్న ప్రచారాన్ని శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు చేపట్టారు. శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవములు, నిత్యసేవలు, ప్రత్యేక ఉత్సవాలతోపాటు కొత్తగా ప్రారంభించిన నాదనీరాజనం వంటి భక్తి సంగీత ప్రచార కార్యక్రమాల్లో ఈ కళాశాల ప్రథమ భూమిక పోషిస్తున్నది. తద్వారా స్వామివారి వైభవాన్ని ప్రపంచ నలుదిశలా చాటుతున్నది.
శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవములలో భాగంగా మూడవ రోజైన గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడకు చెందిన గోవిందరాజన్ వారి బృందం చేసిన వీణ సంగీతం ప్రేక్షకులను అలరించింది. 10.30 గంటలకు ప్రముఖ గాయకులు కామిశెట్టి శ్రీనివాసులు అన్నమయ్య కీర్తనలను ఆలపించి వీక్షకులను అలరించారు.
అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు రవిప్రభ, ఈశ్వరమ్మల నాదస్వరం ఆకట్టుకొంది. అనంతరం 5.30 గంటలకు హైదరాబాదు బ్రదర్స్ వారి గాత్ర యుగళం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.