సనాతన ధర్మం సంపూర్ణ జీవితానికి మార్గదర్శనం : శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి

సనాతన ధర్మం సంపూర్ణ జీవితానికి మార్గదర్శనం : శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి

తిరుపతి, మే, 18, 2013: సనాతన ధర్మం మనిషి సంపూర్ణ జీవితాన్ని గడిపేందుకు మార్గదర్శనం చేస్తుందని కంచి మఠం స్వామి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం రెండో విడత శుభప్రదం వేసవి శిక్షణ తరగతుల సమాపనోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేస్తూ సనాతన ధర్మ మతం సృష్టి ప్రారంభం నుండి ఉందన్నారు. ఇది వినయం, వివేకం, సదాచారాలను బోధిస్తుందని, వీటిని పాటిస్తే జీవితంలో ఎలాంటి ఆటంకాలనైనా సులువుగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు. తపో, జ్ఞాన, సత్య ప్రధాన దేశం భారతదేశమని, మహర్షులు ఎంతో తపస్సు చేసి ముందుతరాల వారికి జ్ఞానాన్ని అందించారని వివరించారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆదర్శ జీవనానికి అవసరమైన అన్ని విషయాలను బోధించారని, విద్యార్థినీ విద్యార్థులు జీవితాంతం వీటిని గుర్తుంచుకోవాలని సూచించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ప్రసంగిస్తూ మన పూర్వీకులైన రుషులు, మహర్షులు అనేక రూపాల్లో అందించిన ఆస్తిని మనం అనుభవించలేక పోతున్నామన్నారు. వేదాలు, భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలకు మించిన ఆస్తి మరొకటి లేదన్నారు. మన దైనందిన జీవితంలో సహజమైన భారతీయ సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రకృతిని ఆరాధించాలని, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలతో వినయంగా మెలగాలని విద్యార్థులకు సూచించారు. మన పురాణాలు జీవితానికి సరిపడినంత వాఙ్మయాన్ని, వివేకాన్ని అందిస్తున్నాయని, వీటిని అధ్యయనం చేయాలని కోరారు. తిరుమల శ్రీవారికి అనేక విధాలుగా అందుతున్న కైంకర్యాలతో ఇలాంటి కార్యక్రమాలను ఆయనే నడుపుతున్నారని ఈవో పేర్కొన్నారు.
ఈ తరగతుల్లో గురువులు నేర్పిన విషయాలను తల్లిదండ్రులతో, మిత్రులతో, బంధువులతో పంచుకోవాలని, ఎలా ఆచరణలో పెట్టాలో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులు శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లిలాగా ఆదర్శవంతులు కావాలని ఆయన అభిలషించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ కేంద్రాల్లో బోధించిన అధ్యాపకులకు ఈ సందర్భంగా ఈవో కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో 2012, నవంబరు 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 30వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. 6, 7 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ధర్మప్రవేశిక పేర్లతో ఈ పరీక్షలు నిర్వహించారు.
ధర్మపరిచయం విభాగంలో రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన నెహ్రూ హైస్కూల్‌ ఏడో తరగతి విద్యార్థిని వై.సాయి దివ్య మొదటి ర్యాంకు, అదిలాబాద్‌ జిల్లా అసిఫాబాద్‌కు చెందిన ఏ.పి సాంఘిక సంక్షేమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని జె.శకుంతల రెండో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా ఇంజరానికి చెందిన విజ్‌డమ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి టి.వెంకట వినయ్‌ మూడో ర్యాంకు సాధించారు. కడప జిల్లా పెద్దముడియం మండలం భీమగుండానికి చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థి టి.వెంకట సుదర్శన్‌, కృష్ణా జిల్లా కేతనకొండకు చెందిన సి.బి.ఆర్‌ స్కూల్‌ ఏడో తరగతి విద్యార్థి జె.బిపిన్‌వ్యాస్‌ కన్సొలేషన్‌ బహుమతులు కైవసం చేసుకున్నారు.
ధర్మప్రవేశిక విభాగంలో రాష్ట్రస్థాయిలో చిత్తూరు జిల్లా నారాయణవనానికి చెందిన జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని సి.రవళి మొదటి ర్యాంకు, గుంటూరు జిల్లా మణిపురానికి చెందిన శ్రీ బొర్ర నాగేశ్వరరావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం.శైలజ రెండో ర్యాంకు, మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌ పదో తరగతి విద్యార్థిని ఎస్‌.రమ్యశ్రీ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా అమరపురం గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.పవిత్ర, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఏ.పి బాలుర గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి ఎం.వాసుదేవ శివప్రసాద్‌ కన్సొలేషన్‌ బహుమతులు సాధించారు.

రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి బంగారు పతకంతో పాటు రూ.4 వేలు నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి బంగారు పతకంతో పాటు రూ.3 వేలు నగదు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి బంగారు పతకంతోపాటు రూ.2 వేలు నగదు బహుమతులు అందజేశారు. కన్సొలేషన్‌ బహుమతులు సాధించిన ఇద్దరికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకం, రూ.వెయ్యి చొప్పున నగదు అందించారు.
ధర్మ పరిచయం విభాగంలో చిత్తూరు జిల్లాలో తిరుపతికి చెందిన టి.దీపిక మొదటి ర్యాంకు, పీలేరు మండలానికి చెందిన బి.హిమబిందు రెండో ర్యాంకు, కాణిపాకానికి చెందిన బి.సాయిసింధు మూడో ర్యాంకు సాధించారు. రామచంద్రాపురానికి చెందిన జి.హేమలత, పూతలపట్టుకు చెందిన పి.యశ్వంతి కన్సొలేషన్‌ బహుమతులకు ఎంపికయ్యారు. అదేవిధంగా తమిళనాడు పరిధిలో చెన్నైలోని కేసరి హయ్యర్‌ సెకండరీ స్కూలుకు చెందిన ఎస్‌.మధు మొదటి ర్యాంకు, క్రిష్ణగిరికి చెందిన ఎన్‌.దివ్య రెండో ర్యాంకు, తిరువళ్లూరుకు చెందిన కె.శ్రీదేవి మూడో ర్యాంకు సాధించారు. తిరువళ్లూరుకు చెందిన ఎం.ప్రియాంక, తిరువొత్తియూరుకు చెందిన ప్రీతి కన్సొలేషన్‌ బహుమతులకు ఎంపికయ్యారు.
ధర్మప్రవేశిక విభాగంలో చిత్తూరు జిల్లాలో తిరుపతికి చెందిన బి.జాహ్నవి మొదటి ర్యాంకు, బి.ఎన్‌.కండ్రిగకు చెందిన ఎ.లలిత రెండో ర్యాంకు, ములకలచెరువుకు చెందిన ఎం.శిరీష మూడో ర్యాంకు సాధించారు. మదనపల్లికి చెందిన డిఎన్‌.భువనేశ్వరి, బి.ఎన్‌.కండ్రిగకు చెందిన ఎస్‌.సునీత కన్సొలేషన్‌ బహుమతులకు ఎంపికయ్యారు. అదేవిధంగా తమిళనాడు పరిధిలో చెన్నైలోని కేసరి హయ్యర్‌ సెకండరీ స్కూలుకు చెందిన ఎం.వి.శేషాద్రి మొదటి ర్యాంకు, చెన్నై విల్లివాక్కంకు చెందిన సిహెచ్‌.రవళి రెండో ర్యాంకు, తిరువొత్తియూరుకు చెందిన బి.సుష్మ మూడో ర్యాంకు సాధించారు. చెన్నై షావుకారుపేటకు చెందిన పి.దివ్య, చెన్నై టీ.నగర్‌కు చెందిన ఎ.జగదీష్‌ కన్సొలేషన్‌ బహుమతులకు ఎంపికయ్యారు.
జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకంతో పాటు రూ.వెయ్యి నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకంతో పాటు రూ.750/- నగదు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకంతోపాటు రూ.500/- నగదు బహుమతులు అందజేశారు. కన్సొలేషన్‌ బహుమతులు సాధించిన ఇద్దరికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకం, రూ.400/- చొప్పున నగదు అందుకున్నారు. తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకటరామిరెడ్డి, స్విమ్స్‌ సంచాలకురాలు డాక్టర్‌ వెంగమ్మ, డాక్టర్‌ కృష్ణప్రశాంతి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, ప్రముఖ పండితులు శ్రీ సర్వోత్తమరావు, శ్రీ చెంచుసుబ్బయ్య, శ్రీ దామోదర్‌నాయుడు, శ్రీ సత్యనారాయణ రాజు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ డెప్యూటీ ఈవో శ్రీ ఉమాపతిరెడ్డి, కో-ఆర్డినేటర్‌ శ్రీ చెన్నకేశవులునాయుడు, సాయిరాం ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
  
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.