COLOURFUL PUSHPA YAGAM HELD IN KRT _ సప్తవర్ణ శోభితం శ్రీ కోదండరాముని పుష్పయాగం
Tirupati, 03 May 2025: The Pushpayaga Mahotsavam was held on Saturday in a grand manner at the Sri Kodandarama Swamy Temple in Tirupati.
As part of this, earlier during the day Snapana Tirumanjanam to Kodandarama Swamy along with Sri Seetha Devi and Lakshmana Swamy was performed.
Later in the evening, from 4 pm to 6 pm, the Pushpayagam was held in the Unjal Mandapam of the temple amidst the chanting of Vedic mantras by the priests.
A total of 3 tons of flowers were offered to the utsava deities including 12 types of flowers and six types of leaves.
Donors from the states of Andhra Pradesh, Tamil Nadu, and Karnataka donated these traditional and ornamental flowers.
The devotees were enthralled by the visual grandeur of this flower festival.
Pushpayagam is usually observed as a sin-free ritual.
Deputy EO Smt. B. Nagaratna, Garden Deputy Director Sri Srinivasulu, AEO Sri Ravi, Superintendent and other officials and a large number of devotees participated in this program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సప్తవర్ణ శోభితం శ్రీ కోదండరాముని పుష్పయాగం
తిరుపతి, 2025 మే 03: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 12 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు 3 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.
బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
పుష్పయాగం అనంతరం రాత్రి 7 నుంచి శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఏఈఓ శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.