సింహ వాహనంపై అనంతతేజోమూర్తి
సింహ వాహనంపై అనంతతేజోమూర్తి
తిరుపతి, మే 19, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం అనంతతేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా కదులుతుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనంతతేజోమూర్తి శ్రీనివాసుడు రాక్షసుల మనస్సులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. అందుకే ధీరోదాత్తుడగు శ్రీ వేంకటేశ్వరుడు సింహవాహనాన్ని అధిరోహిస్తాడు.
అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నిత్య అలంకార ప్రియుడగు శ్రీవారు ఒక్కొక్కరోజు ఒక్కొక్క వస్త్రాభరణ అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. ప్రత్యేకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను ప్రశంసిస్తోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ షడగోప రామానుజ పెదజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్‌స్వామి, తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చంథ్రేఖరపిళ్లై, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న సెట్టింగులు
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో తితిదే గార్డెన్ విభాగం పలు పురాణాంశాలతో ఏర్పాటుచేసిన సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కొలనులోకి దిగిన ఏనుగు కాలిని మొసలి నోటకరచడం, శ్రీమహావిష్ణువు గరుడపక్షిపై వచ్చి విష్ణుచక్రంతో మొసలిని సంహరించడం అనే భావంతో ”గజేంద్రమోక్షం” సెట్టింగును ఏర్పాటుచేశారు. మరోవైపు ‘శ్రీ వేంకటేశ్వరుని వడ్డికాసులను కుబేరునికి కొలిచి ఇస్తున్న గోవిందరాజస్వామి’ సెట్టింగు చూడచక్కగా ఉంది. అలాగే సీతారామలక్ష్మణులు పడవపై వెళ్తున్న సెట్టింగు భక్తులను తన్మయత్వానికి గురి చేస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.