సింహ వాహనసేవలో ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
సింహ వాహనసేవలో ఆకట్టుకున్న కళాప్రదర్శనలు
తిరుమల, 2023 సెప్టెంబరు 20: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం సింహ వాహనసేవలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మికానందం కలిగించాయి. వివిధ ప్రాంతాలకు చెందిన 10 కళాబృందాలలో 206 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.
తమిళనాడు రాష్ట్రం, శ్రీరంగానికి చెందిన భగవద్రామానుజ సంప్రదాయ పరంపరను తెలిపే దాసవైభవం రూపకం, కర్ణాటక రాష్ట్ర నృత్య సంప్రదాయాలైన డోలుకునిత డోలువాయిద్య విన్యాసం, కల్పశ్రీ, పూజ కునిత, గోపికా రూప కాంతలై జానపద కళా నృత్యరూపకం ఆకట్టుకున్నాయి. అదేవిధంగా, దాసనమనం, గొరవర కునిత, వీరగాసె, మైసూరుకు చెందిన దాస సంకీర్తన రూపకం, విజయవాడకు చెందిన కంకిపాడు కోలాట భజన సంప్రదాయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.