GODDESS GLITTERS WITH PEACOCK FEATHERS AND LOTUS SEEDS _ సిరులతల్లికి వేడుకగా స్నపనతిరుమంజనం
సిరులతల్లికి వేడుకగా స్నపనతిరుమంజనం
– ప్రత్యేక ఆకర్షణగా నేమలి ఈకల మాల, తాయర గింజలు, నెల్లికాయ మాలలు
– భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ
తిరుపతి, 2024 నవంబరు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది.
కంకణభట్టర్ శ్రీ శ్రీనివాస ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర చామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు.
ఏడు రకాల మాలలు
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీప్రశ్నసంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున ఏడు రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. నేమలి ఈకల మాల, తాయర గింజలు, ఫైనాపిల్, రోజ్ పెటల్స్, నెల్లికాయ, తులసి, రంగురాళ్లతో కూడిన రోజామాలలు అమ్మవారికి అలంకరించారు.
ఆకట్టుకున్న ఫల పుష్ప మండపం
స్నపనతిరుమంజనం నిర్వహించే శ్రీ కృష్ణముఖ మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన పుష్పాలు, రెడ్, గ్రీన్ యాపిల్, మొక్కజొన్న, జామ, ఆరంజ్ తదితర ఫలాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మండపాన్ని 20 మంది టీటీడీ గార్డెన్ సిబ్బంది రెండు రోజుల పాటు శ్రమించి అలంకరించారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకున్న పుష్పాలంకరణ
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజమండపం, గర్భాలయం, శ్రీకృష్ణస్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం, వాహనమండపం, ఆస్థానమండపం టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. గార్డన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 70 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి సుందరంగా అలంకరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్,
ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.