సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పాభిషేకం
సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి పుష్పాభిషేకం
తిరుపతి, 2021 జూలై 17: సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా రెండవ రోజైన శనివారం ఉదయం కనకాంబరాలు, మల్లెపూలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్లైన్ వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు.
కోవిడ్-19 కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ టిటిడి ఈ మహాయాగం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో బాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు.
టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో 180 మంది ఋత్వికులు చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి,హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం కోటి అర్చన, మహా నివేదన, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఈ మహాయాగాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, శ్రీ మధు, అలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.