LORD DHANVANTARI SHINES ON SURYA PRABHA _ సూర్యప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు
Srinivasa Mangapuram, 20 Feb. 20: On the seventh day of annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple at Srinivasa Mangapuram, Lord glittered on the celestial Surya Prabha vahanam in “Dhanvantari”-the God of Medicine on Thursday morning.
Surya Prabha Vahanam denotes the power of Lord to grant health and relief from all diseases to His devotees by empowering them with natural healing capabilities.
DyEO Sri Yellappa, AEO Dhananjayudu, Superintendent Sri Chengalrayulu and other participated.
RATHOTSAVAM ON FEBRUARY 21
As part of the annual brahmotsavams, TTD is organising grand Rathotsavam on Friday at 8.30am followed by the Aswa Vahanam in the evening with which the vahana seva of lord culminates.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు
తిరుపతి,2020 ఫిబ్రవరి 20: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ధన్వంతరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్యప్రాప్తి
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం కల్యాణ సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిస్తాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే కల్యాణ సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
వాహన సేవ అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబరి నీళ్ళతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
చంద్రప్రభవాహనం – మానసికశాంతి ప్రాప్తి
రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి. శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి. చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం. పాపహరం.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లమ్మ, ఏఈవో శ్రీ ధనంజయుడు, ప్రధాన అర్చకులు శ్రీబాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 21న రథోత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 4.17 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.