సెక్యూరిటీ గార్డుల శిక్షణా శిబిరం ముగింపు

సెక్యూరిటీ గార్డుల శిక్షణా శిబిరం ముగింపు

తిరుపతి, మార్చి-26, 2011: దేశభద్రత నుండి స్వామిసేవకు ఎంపికైన సెక్యూరిటీ గార్డులు ఇతర సిబ్బందికి ఆదర్శంగా తయారు కావాలని తితిదే ముఖ్యభద్రతాధికారి శ్రీ ఎం.కె.సింగ్‌ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక ‘శ్వేత’ నందు ఏడు రోజులపాటు జరిగిన సెక్యూరిటీ గార్డుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు.

ఈ సందర్భంగా శ్రీ ఎం.కె.సింగ్‌ మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డులు కంచెలాంటి వారని, కంచె చేనుమేస్తే ఏమీ మిగలదని, అంతేగాక భద్రతాసిబ్బంది ఎల్లప్పుడూ ఒకరిమెప్పు కొఱకు పనిచేయరాదని, వారు నిస్వార్థంగా పనిచేసినప్పుడే సరస్థకు మేలు చేకూరుతుందని కనుక సిబ్బంది నిస్వార్థంగా పనిచేయాలని ఆయన కోరారు.

తితిదే ఎడిటర్‌ ఇన్‌ ఛీఫ్‌ డాక్టర్‌ రవ్వా శ్రీహరి మాట్లాడుతూ భక్తుల సేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా స్వామి అనుగ్రహానికి గురి అవుతారని తెలిపారు. భద్రతా సిబ్బంది తిరుమలకు విచ్చేసే భక్తుల ధన,మాన, ప్రాణ రక్షణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన వారిని కోరారు. భద్రతా సిబ్బందికి పవిత్ర క్షేత్రంలో ఉద్యోగం లభించడం పుణ్యం అని, అదేవిధంగా వారు సేవాభావంతో, భక్తి తత్పరతతో స్వామివారి కైంకర్యంగా భావించి విధులు నిర్వహించాలని అన్నారు.

ఈ సందర్భంగా 35 మంది భద్రతా సిబ్బందికి సర్టిఫికెట్లను తితిదే ముఖ్యభద్రతాధికారి అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ముఖ్య భద్రతాధికారి శ్రీ శివకుమార్‌రెడ్డి, విజిఓలు వెంకటరత్నం, మనోహర్‌లు, శ్వేత డైరెక్టర్‌ డాక్టర్‌ కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.