సెప్టెంబరు 2వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘కోనేటిరాయుడికే నీటి కటకటా..’
అనే వార్త వివరణ

                                
సెప్టెంబరు 2వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘కోనేటిరాయుడికే నీటి కటకటా..’
అనే వార్త వివరణ


సెప్టెంబరు 2వ తేదీన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ‘కోనేటిరాయుడికే నీటి కటకటా..’ అనే శీర్షికతో ప్రచురించిన వార్త వాస్తవ దూరం.

తిరుమలలో ప్రస్తుతం ఎలాంటి నీటి కొరతా లేదు. భక్తుల రద్దీని బట్టి రోజుకు 25 లక్షల గ్యాలన్ల నుండి 39 లక్షల గ్యాలన్ల వరకు నీరు అవసరమవుతోంది. అయితే పాపవినాశనం డ్యామ్‌, ఇతర బోర్ల ద్వారా 22 లక్షల గ్యాలన్ల నీటిని తితిదే పంపింగ్‌ చేసుకుంటోంది. అదనంగా కావాల్సిన నీటిని వాటర్‌ ట్యాంకర్ల ద్వారా సమకూర్చుకుంటోంది.

తితిదే కేవలం డ్యామ్‌ల ద్వారానే రోజుకు 48 లక్షల గ్యాలన్ల నీటిని సమకూర్చుకోవడానికి ప్రణాళికలను రూపొందించింది. ఇందులో పాపవినాశనం డ్యామ్‌, కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌, కల్యాణి డ్యామ్‌ల ద్వారా 16 లక్షల గ్యాలన్ల చొప్పున నీటిని సమకూర్చు కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక బోర్ల ద్వారా వచ్చే నీరు అదనం. కల్యాణి డ్యామ్‌లో నీరు లేకపోవడం, కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌ నుండి పైపులైన్‌ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతి రాకపోవడం వంటి కారణాలతోనే నీటి అవసరాల కోసం తితిదే ట్యాంకర్లను వినియోగించాల్సి వస్తోంది. అంతేగాక పైపులైన్‌ ఏర్పాటకు అటవీ శాఖ నుండి ఏ క్షణంలోనైనా అనుమతి వచ్చే అవకాశముంది. ఈ అనుమతి వచ్చినట్టయితే పాపవినాశనం డ్యామ్‌, కుమారధార మరియు పసుపుధార డ్యామ్‌ల నుండి రోజుకు 32 లక్షల గ్యాలన్ల నీటిని పంపింగ్‌ చేసుకునే వీలు కలుగుతుంది. బోరు బావుల ద్వారా మరో 5 లక్షల గ్యాలన్ల నీరు లభ్యమవుతుంది.

కల్యాణిడ్యామ్‌లో నీటి లభ్యత లేకపోయినా తిరుమలలో ఉన్న నీటి వనరుల ద్వారా 5 నెలల పాటు కొరత తలెత్తకుండా చూడగల వ్యవస్థను తితిదే సిద్ధం చేసుకుంది. అంతేగాకుండా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి కార్పొరేషన్‌ సహకారంతో 16 లక్షల గ్యాలన్ల తెలుగు గంగ నీటిని శ్రీవారిమెట్టు మార్గం ద్వారా పంపింగ్‌ చేసుకోవడానికి తితిదే ప్రయత్నిస్తోంది. ఈ నీటిని కల్యాణి డ్యామ్‌ నుండి రావాల్సిన నీటికి ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. ఈ విధంగా 2030వ సంవత్సరం వరకు తిరుమలలో భక్తులకు ఎలాంటి నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు తితిదే సర్వం సిద్ధం చేసుకుంది.

అంతేగాక నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా కొళాయిల లీకేజీలు లేకుండా చేసి నీటివృథాను తితిదే అరికడుతోంది. అలాగే వాడేసిన నీటిని వనవిభాగంలో మొక్కలకు, చెట్లకు ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో మరుగుదొడ్ల శుద్ధికి కూడా ఇలాంటి నీటిని వినియోగించాలని తితిదే యోచిస్తోంది. ఇలా చేయడం వల్ల రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని పొదుపు చేసుకునే అవకాశముంటుంది.

అయితే సదరువార్తలో పాలకులకు ముందుచూపు కరువని, శాశ్వత పరిష్కారంపై శ్రద్ధే లేదని అవాస్తవాలు ప్రచురించడం శోచనీయం. నిత్యం తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు నీరందించడానికి తితిదే ఇంజినీరింగ్‌ విభాగం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షలు చేసి, ప్రణాళికాబద్దంగా తగు చర్యలు తీసుకుంటుంటే, మీరు ఇలాంటి అభూత కల్పనలతో కూడిన వార్తలు ప్రచురించి భక్తులను అయోమయానికి గురి చేయడమే కాకుండా భక్తుల సౌకర్యాల మెరుగుకై నిరంతరం కృషి చేస్తున్న సిబ్బంది అంకితభావాన్ని హేళన చేసే విధంగా కథనాలు ప్రచురించడం బాధాకరం.

కనుక పైతెల్పిన వాస్తవాల్ని రేపటి మీ దినపత్రికనందు వివరణగా ప్రచురించాల్సినదిగా కోరడమైనది.


ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి