TIRUMALA NAMBI AVATAROTSAVAM _ సెప్టెంబరు 9న శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు

Tirumala, 08 September 2024: The renowned Sri Vaishnavaite who pioneered Abhisheka Kainkaryam in Tirumala temple, Sri Tirumala Nambi fete will be observed on September 9 at Tirumala Nambi Sannidhi.

Every year TTD observes the Avatarotsavam of the great Sri Vaishnava saint. 

On Monday, the Alwar Divyaprabandha Project of TTD observes the 1051st Avatarotsavam of Sri Tirumala Nambi with scholarly addresses.

The literary event commences from 9:30am onwards.

The Ahobila Mutt Pontiff Sri Ranganadha Yateendra Mahadesikan Swamiji will render his Anugraha Bhashanam on the occasion.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 9న శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు

తిరుమ‌ల‌, 2024 సెప్టెంబరు 08: ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సెప్టెంబరు 9వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఉద‌యం 9.30 గంటల నుండి 16 మంది ప్ర‌ముఖ పండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత చ‌రిత్ర‌పై ఉప‌న్య‌సించ‌నున్నారు.

శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వర‌స్వామివారి అభిషేకానికి సంబంధించిన పవిత్రజలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశ‌నం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామివారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు.

అందుకు తిరుమలనంబి బాధపడుతూ ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా” అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు ”చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా” అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.