SRI RAMA EMBRACES DEVOTEES ON HANUMANTA VAHANAహనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి
హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి
తిరుమల, 2024 అక్టోబరు 08: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
`
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.