SRI RAMA GRACES HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై శ్రీరాములవారి అలంకారంలో శ్రీనివాసుడు
హనుమంత వాహనంపై శ్రీరాములవారి అలంకారంలో శ్రీనివాసుడు
హైదరాబాద్ / తిరుపతి, 2025 మార్చి 03: జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీరాములవారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.