3 DAY ANNUAL PADMAVATHI PARINAYAM CONCLUDES AT TIRUMALA ON MAY 21 _ కన్నుల పండుగగా ముగిసిన పద్మావతీ పరిణయోత్సవాలు
కన్నుల పండుగగా ముగిసిన పద్మావతీ పరిణయోత్సవాలు
తిరుమల, 21 మే – 2013: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ప్రతి ఏటా మూడురోజుల పాటు నిర్వహించే సాలకట్ల పద్మావతీ పరిణయోత్సవాలు మంగళరంనాడు కన్నుల పండుగగా ముగిశాయి.
మంగళవారం సాయంత్రం 4.30 గం||లకు వాహనమండపం నుండి సకలాభరణ భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనారూఢుడై తిరుమాడ వీధులలో ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనాలలోని పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేసారు.
మరో పల్లకిలో దేవేరులు వేంచేపు చేసారు. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పద్మావతి పరిణయోత్సవాన్ని నిర్వహించారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని తి.తి.దే మంగళవారంనాడు ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.
కాగా ఈ సందర్భంగా తి.తి.దే అన్నమాచార్య ప్రాజెక్టు, హెచ్.డి.పి.పి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను భక్తుల కొరకు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని తి.తి.దే ఏర్పాటు చేసిన పందిళ్ళు, పూల అలంకారాలు అలరించగా, ఉత్సవానంతరం నిర్వహించిన బాణసంచా కార్యక్రమం భక్తజన సందోహాన్ని అబ్బుర పరచింది.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.