ADHYAYANOTSAVAMS TO CONCLUDE ON JAN 23 _ జనవరి 23న ముగియనున్న అధ్యయనోత్సవాలు
జనవరి 23న ముగియనున్న అధ్యయనోత్సవాలు
తిరుమల, 2025 జనవరి 22 ; తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు జనవరి 23వ తేదీ ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబరు 30న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 25 రోజుల పాటు జరుగుతాయి.
ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగార్లు ప్రతి రోజు గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదిస్తున్నారు. ఈ 25 రోజుల్లో ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవైష్ణవులు స్వామివారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పారాయణం చేస్తున్నారు.
కాగా అధ్యయనోత్సవాల్లో తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీ వరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున తణ్ణీరముదు ఉత్సవంతో ఈ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.