ANNAMAYYA’S COPPER PLATES PUT FOR DISPLAY _ మహతిలో అన్నమయ్య రాగిరేకుల ప్రదర్శన
తిరుపతి, మే 25, 2013: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 605వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎస్వీ మ్యూజియం ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలోని సెల్లార్‌లో ఏర్పాటుచేసిన అన్నమయ్య సంకీర్తనల రాగిరేకుల ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. మే 24 నుండి 26వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుంది.
ఇందులో తిరుమల ఆలయంలోని ”తాళ్లపాక అర”లో లభించిన సంకీర్తనల రాగిరేకులు, తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన అలనాటి అపురూపమైన ఛాయాచిత్రాలు, అన్నమయ్య తిరుగాడిన ప్రదేశాలు, శ్రీవారికి హుండీలో లభించిన బంగారు నాణేలు ప్రదర్శనకు ఉంచారు.
ఇంకా అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక, పరిసర చారిత్రక నిర్మాణాలు, గుడిగోపురాలు, అన్నమయ్య దర్శించిన క్షేత్రాలు, తపాలా శాఖ విడుదల చేసిన స్టాంపులు, అన్నమయ్యకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని వివరించే చిత్తరువులు ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 283వ జయంతి సందర్భంగా ఆ మహాయోగిని వివరాలతో కూడిన ఛాయాచిత్రాలు ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శన ఉదయం 9.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు ఉంటుంది.
ఈ సందర్భంగా తితిదే చీఫ్ మ్యూజియం అధికారి శ్రీ జె.విజయకుమార్ మాట్లాడుతూ ఎక్కడైనా పురాతన, చారిత్రక నేపథ్యం గల శాసనాలు, వస్తువులు లభిస్తే ఎస్వీ మ్యూజియానికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. భావితరాల వారికి మన పురాతన చరిత్రను తెలిపేందుకు వీటిని భద్రపరుస్తామని ఆయన తెలిపారు.
—————————–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.