ANNUAL BRAHMOTSAVAMS OF SRI VENUGOPALA SWAMY FROM JUNE 6 _ సంతాన భాగ్యాన్ని ప్రసాదించే వేణుగోపాల స్వామి

Tirupati, June 05, 2026: The annual Brahmotsavams of Sri Rukmini-Satyabhama Sametha Sri Venugopala Swamy Temple at Karvetinagaram will be celebrated from June 6 to 14 with religious grandeur.

The temple, revered for blessing childless couples with progeny and fulfilling devotees’ wishes, commenced the festivities with the traditional Ankurarpanam ceremony on Thursday.

Known for its rich history, architectural splendour, and spiritual significance, the temple is one of the prominent ancient shrines in the region. The deity, flanked by Sri Rukmini and Sri Satyabhama, attracts devotees from far and wide.

TTD has made elaborate arrangements for the smooth conduct of the annual festival and invited devotees to participate in large numbers and seek the blessings of Sri Venugopala Swamy.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంతాన భాగ్యాన్ని ప్రసాదించే వేణుగోపాల స్వామి

చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం

జూన్ 6 నుండి 14 వరకు వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు

నేడు అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం

తిరుపతి, 2026 జూన్ 05: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షంగా, సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే దివ్యక్షేత్రంగా విశేష ఖ్యాతి పొందింది. ఈ పవిత్ర ఆలయంలో జూన్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

శాస్త్రోక్తంగా అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు ముందు శాస్త్రోక్తంగా జూన్ 5న సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించి అనంతరం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5.30 గం.లకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం తోమాల, కొలువు, మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించారు.

చరిత్రకు చిరునామాభక్తికి నిలయమైన ఆలయం

సుమారు 5.15 ఎకరాల విస్తీర్ణంలో అద్భుత శిల్పకళా వైభవంతో నిర్మితమైన ఈ ఆలయం భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆసియాలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన 16 ఎకరాల స్కంద పుష్కరిణి ఈ క్షేత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ.

చోళుల కాలం నాటికే ఈ ఆలయం ఉనికిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. సుమారు 400 ఏళ్ల క్రితం కార్వేటినగర రాజవంశీయుడు వెంకటపెరుమాళ్ రాజు ఆలయాన్ని పునర్నిర్మించారు. వేణువు ధరించి, పాదాల వద్ద వెన్నకుండతో, వెనుక గోవుతో, ఇరువైపులా రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో దర్శనమిచ్చే స్వామివారి దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఏకశిలా శిల్పకళకు అద్భుత నిదర్శనం

ఆలయ ప్రాంగణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు విశేష ప్రాధాన్యం కలిగినవి. శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు తోరణంతో సహా ఏకశిలలో చెక్కబడటం ఈ క్షేత్ర వైభవాన్ని మరింత గొప్పగా నిలబెడుతోంది.

సారంగపాణి కీర్తనలతో ప్రసిద్ధి పొందిన క్షేత్రం

ప్రఖ్యాత వాగ్గేయకారుడు శ్రీ సారంగపాణి ఈ క్షేత్రాధిదేవుడైన శ్రీ వేణుగోపాలస్వామిపై 200కు పైగా భక్తి కీర్తనలు రచించడం విశేషం. 1936 నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం 1989 ఏప్రిల్ 10న టీటీడీలో విలీనమైంది. అప్పటి నుండి టీటీడీ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తోంది.

నిత్య కైంకర్యాల్లో విశిష్ట నైవేద్యాలు

ప్రతిరోజూ నవనీతం, పెరుగన్నం, కట్టె పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, పాలు, డ్రైఫ్రూట్స్, పండ్లు తదితర ప్రత్యేక నైవేద్యాలను స్వామివారికి సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నారు. పర్వదినాల్లో క్షీరాన్నం, బెల్లం పొంగలి, అప్పం, లడ్డూ, వడ, సుగిలు, బెల్లం దోస వంటి విశేష నైవేద్యాలు సమర్పిస్తారు.

ఉత్సవాల వైభవం భక్తులను అలరిస్తుంది

ప్రతి శుక్రవారం మూలవిరాట్‌కు అభిషేకం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో గృహస్తులు రూ.700 చెల్లించి స్వామి-అమ్మవార్ల కళ్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించారు. తెప్పోత్సవాలు, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, శ్రీరామనవమి, గోకులాష్టమి, పశువుల పండుగ వంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత.

భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు

ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకునే భక్తులకు దాతల సహకారంతో మధ్యాహ్నం రుచికరమైన ఉచిత అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేస్తున్నారు.

1989 ఏప్రిల్ 10 టీటీడీలో విలీనం

శ్రీ రుక్మిణీ–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం కార్వేటినగర రాజుల పాలన అనంతరం 1936 నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అనంతరం 1989 ఏప్రిల్ 10న ఈ ఆలయం టీటీడీలో విలీనం అయింది. టీటీడీ ఆధ్వర్యంలోకి వచ్చిన తరువాత ఆలయ అభివృద్ధికి విశేష ప్రాధాన్యం లభించగా, వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, తెప్పోత్సవాలు తదితర ఉత్సవాలు శాస్త్రోక్తంగా, వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, నిత్యకైంకర్యాలు, ఆర్జిత సేవలను క్రమబద్ధంగా నిర్వహించడం ద్వారా ఈ దివ్యక్షేత్రం మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది