ANNUAL FEST COMMENCES WITH DHWAJAROHANAM _ ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

TIRUPATI, 07 JUNE 2025: The annual nine day festival of Brahmotsavams in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta commenced in a grand manner with the sacred Garuda flag hoisting fete.

The ceremonious Dhwajarohanam was performed between 7:30am and 8am in the auspicious Mithuna Lagnam on Saturday.

Later Snapanam Tirumanjanam will be observed to the utsava deities followed by Unjal Seva in the evening.

Attractive decorations

The floral and electrical decorations have been attracting devotees.

TTD has also laid coolant shades and arranged buttermilk for the devotees to overcome the scorching temperatures.

Temple DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani, temple inspector Sri Siva Kumar, archakas, devotees, sevaks were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి/అప్పలాయగుంట, 2025, జూన్ 07: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7.30 నుండి 8.00 గంటల మద్య మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 5.30 నుండి 6.00 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. మిథున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.

టిటిడి పటిష్ట ఏర్పాట్లు:

బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున టిటిడి పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశారు. ఎస్వీ మ్యూజిక్ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని టిటిడి కోరుతోంది.

అనంతరం ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు.

సాయంత్రం 5.30 నుండి రాత్రి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా జరుగనుంది.

బ్రహ్మోత్సవాల్లో మొదటిదైన పెద్దశేష వాహన సేవ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు వైభవంగా జరుగనుంది.

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున పుష్పాలంకరణలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్‌ దీపాలంకరణలు రూపొందించారు. భ‌క్తుల‌కు వేస‌విలో ఇబ్బంది లేకుండా చ‌లువ పందిళ్లు, తాగునీరు, మ‌జ్జిగ‌, అన్న‌ప్ర‌సాదాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్ర‌థ‌మ చికిత్స‌ కేంద్రం, ఆయుర్వేద వైద్య‌శాల త‌దిత‌ర కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవ రాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టింపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఏవీఎస్వో శ్రీ సతీష్ కుమార్ ఇతర ఆధికారులు, ఆలయ అర్చకులు, శ్రీ‌వారి సేవ‌కులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది