ANNUAL VASANTHTOSAVAM COMMENCES IN TIRUMALA _ శోభాయ‌మానంగా వసంతోత్సవాలు ప్రారంభం

SESHACHALA FORESTS RECREATED IN VASANTA MANDAPAM

DEVOTEES TAKE PART IN THE FETE AFTER TWO YEARS

TIRUMALA, 14 TIRUMALA 2022: The annual Vasanthotsavam was held with religious gaiety and pomp at Vasanta Mandapam in Tirumala and the devotees had a divine opportunity to enjoy the divine grace after a span of two years.

The three day annual spring festival commenced in Tirumala on Thursday with utmost religious fervour. This annual festival was not observed in the last two years due to Covid pandemic.

The devotees had enjoyed every bit of the visual treat provided by the special Seshachala settings laid matching the occasion along with the rhythm of Vedic hymns and snapana tirumanjanam.

TTD Garden wing under the supervision of its Chief Officer Sri Srinivasulu has recreated the deep green woods with various flora and fauna as backdrop setting for the spring festival.

The figurines of tiger, cheetah, monkeys, slender loris, pythons, cobras, aves like peacocks, swans, ducks, hummingbird, mynas, parrots etc. captivated the devotees.

HH Sri Pedda Jiyar Swamy and HH Sri Chinna Jiyar Swamy, Additional EO Sri AV Dharma Reddy, Deputy EO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

శోభాయ‌మానంగా వసంతోత్సవాలు ప్రారంభం

శేషాచలాన్ని తలపించిన వసంతమండపం

రెండేళ్ల త‌రువాత భ‌క్తులకు అవ‌కాశం

ఏప్రిల్ 14, తిరుమల, 2022: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయ‌మానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే ప‌లుర‌కాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. కోవిడ్ కార‌ణంగా గ‌త రెండేళ్లు ఈ ఉత్స‌వాన్ని నిర్వ‌హించ‌లేదు. రెండేళ్ల త‌రువాత భ‌క్తుల‌కు ఈ వేడుక‌లో పాల్గొనే అవ‌కాశం రావ‌డంతో ఎంతో ఆనందంగా పాల్గొన్నారు.

ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు.

వైభవంగా స్నపనతిరుమంజనం

వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

శేషాచలాన్ని తలపించిన వసంతమండపం

టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో వ‌సంత‌మండ‌పాన్ని శేషాచ‌లం అడవిని త‌ల‌పించేలా తీర్చిదిద్దారు. ప‌చ్చ‌ని చెట్లు, పుష్పాలతోపాటు ప‌లుర‌కాల జంతువుల ఆకృతులను ఏర్పాటుచేశారు. వీటిలో పులి, చిరుత‌, కోతులు, పునుగుపిల్లి, కొండ‌చిలువ‌, కోబ్రా, నెమ‌లి, హంస‌లు, బాతులు, హ‌మ్మింగ్ బ‌ర్డ్‌, మైనా, చిలుక‌లు ఉన్నాయి. ఇవిభ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

ఏప్రిల్ 15న స్వర్ణరథోత్సవం…

వసంతోత్సవాల్లో రెండవ రోజైన ఏప్రిల్ 15న శుక్ర‌వారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

చివరిరోజు ఏప్రిల్ 16న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.