ARCHAKA TRAINING FOR SC, ST & FISHERMEN COMMUNITY_ ఎస్సి, ఎస్టి, మత్స్యకారులకు అర్చకశిక్షణను వేగవంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
ఎస్సి, ఎస్టి, మత్స్యకారులకు అర్చకశిక్షణను వేగవంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
తిరుపతి జూన్-24, 2008: ప్రతి మనిషి ఆరోగ్యకరమైన జీవనవిధానం ఎలా గడపాలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని, ఎస్సి, ఎస్టి, మత్స్యకారులకు అర్చకశిక్షణను వేగవంతం చేయాలని తి.తి.దే, కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్వేత నందు జరిగిన 4వ బ్యాచ్ మత్స్యకారులకు పూజావిధానంపై శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు 120 మంది మత్స్యకారులకు శిక్షణ ఇచ్చామని, ఇప్పుడు 40 మందికి శిక్షణ ఇస్తున్నామని, అయితే సంఖ్యాబలంకన్నా ఎంత మంది శిక్షణా కార్యక్రమాన్ని నియమనిష్టలతో బాగా ఉపయోగించుకున్నారు, తద్వారా మీరు ఇతరులను ఏ మేరకు చైతన్యం చేయగలరో ప్రతి ఒక్కరు ఆలోచించాలని ఆయన చెప్పార
ఈ శిక్షణకు వయస్సులో పెద్దవారు, చిన్నవారు వచ్చారని, అయితే క్రొత్త విషయాలు తెలుసుకోవడానికి వయస్సుతో నిమిత్తం లేదని, ఏమైనా సందేహాలు వుంటే వాటిని అధ్యాపకుని ద్వారా నివృత్తి చేసుకోవాలని చెప్పారు. ఈ పూజా విధానంలో తీర్థం యొక్క ప్రాముఖ్యత, తులసీ ఎందుకివ్వాలి, తిలకం ఎందుకు పెట్టుకోవాలి అన్న ప్రాథమిక విషయాలను బాగా తెలుసుకోవాలని చెప్పారు.
మత్స్యకారుల 42 గ్రామాలలోని గుళ్ళకు దేవతా విగ్రహాలు సంవత్సరంలోపు అందజేస్తామని ఆయన చెప్పారు. అయితే శ్వేతలో పూజా విధానంపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకోవడమే గాక సమాజంలో మంచి క్రమశిక్షణ గల వ్యక్తులుగా తమ ప్రవర్తనా పద్ధతుల ద్వారా ఇతరులకు ఆదర్శవంతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఆయన వారిని కోరారు.
ఈ సమావేశంలో శ్వేత డైరెక్టర్ శ్రీభూమన్, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీఏ.వి.ధర్మారెడ్డి, వేటూరిప్రభాకరశాస్త్రి, వాజ్ఞ్మయ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి శ్రీపమిడికాల్వ చెంచుసుబ్బయ్య, మత్స్యకారుల ప్రతినిధి శ్రీతిరుపతి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.