BRAHMOTSAVAMS IN RISHIKESH FROM MAY 22 TO 28 _ రిషికేష్‌లోని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ
రిషికేష్‌లోని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ
తిరుపతి, ఏప్రిల్ 29, 2013: రిషికేష్‌లోని తితిదే ఆంధ్ర ఆశ్రమంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మే 22 నుండి 30వ తేదీ వరకు రిషికేష్‌లో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నట్టు తెలిపారు. మే 21న అంకురార్పణంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో మే 22న ధ్వజారోహణం, మే 23న చిన్నశేష వాహనం, మే 26న గరుడ వాహనం, మే 27న హనుమంత వాహనాలపై శ్రీవారి ఊరేగి భక్తులను కటాక్షించనున్నట్టు వివరించారు. మే 29వ తేదీన రథోత్సవం, కల్యాణోత్సవం, మే 30వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు.
దక్షిణ భారతదేశం నుండి రిషికేష్, హరిద్వార్ వెళ్లే భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. అదేవిధంగా ఉత్తరాది భక్తులు కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ప్రత్యేకశ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి(జనరల్) శ్రీ టి.ఏ.పి.నారాయణ, రిషికేష్ ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ కృష్ణయ్య, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.