DIAL YOUR EO EXCERPTS _ డయల్ యువర్ ఇ.ఓ
డయల్ యువర్ ఇ.ఓ
తిరుమల, 03 మే 2013 : శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఇ.ఓ కార్యక్రమంలో భక్తుల కొన్ని ప్రశ్నలు, సూచనలు వాటికి ఇ.ఓ శ్రీఎల్.వి.సుబ్రహ్మణ్యం స్పందన
1. గాయత్రి – తిరుపతి
తిరుపతి పుర వీధులలో అన్నాహారాలు లేక అవస్థలుపడుతున్న గోవులను తి.తి.దే సంరక్షించగలదు.
ఇ.ఓ. ఇప్పటికే తి.తి.దే తిరుచానూరు చెంత ఒక గోశాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేసింది. తిరుపతిలోని గోవులను సంరక్షించడానికి నగరుపాలక అధికారులతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటాం.
2. మంజునాథ్ – హైదరాబాదు.
శ్రీవారి ఆర్జితసేవలు జరుగుతున్నప్పుడు ఉచ్ఛరిస్తున్న మంత్రాలలో అక్షర, స్వర స్పష్టత ఉండేలా చర్యలు తీసుకొండి.
ఇ.ఓ తప్పకుండా చేస్తాం.
3. ఎస్.రమాదేవి – కదిరి
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సంప్రదాయ వస్త్ర ధారణను ప్రతిపాదించగలరు.
ఇ.ఓ ఇప్పటికే ఆర్జితసేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్ర ధారణ అమలులో ఉన్నది. దీనిపై తి.తి.దే ఎస్.వి.భక్తి ఛానల్‌లో కూడా ప్రచారం కల్పిస్తున్నాం.
4. రవీంద్ర – నల్గొండ
శ్రీవారి ఆలయం లోపల సేవకుల సంఖ్యను తగ్గించగలరు.
ఇ.ఓ తప్పకుండా చేస్తాం.
ఈ కార్యక్రమంలో తిరుమల సంయుక్తకార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, సి.వి.ఎస్.ఓ శ్రీ జి.వి.జి అశోక్‌కుమార్, ఛీఫ్ ఇంజనీర్ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఎస్.ఇ2 శ్రీ రమేశ్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ అనంతరం ఇ.ఓ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర వైభవాన్ని థదిశలో వ్యాపించేయడంలో భాగంగా శ్రీనివాస కల్యాణాలను తి.తి.దే ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం లేకుండా తి.తి.దే ఒక నిర్ధిష్టమైన విధివిధానాల పట్టికను రూపొందించి శ్రీ వేంకటేశ్వర కల్యాణోత్సవ ప్రాజెక్టును ప్రారంభించిందన్నారు. తి.తి.దే ఈ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల గ్రామాలోనే కాకుండా పట్టణాలు, నగరాలలో సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నదన్నారు. అంతే కాకుండా విదేశాలలో సైతం ఈ కల్యాణాలను ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. ఏడాది వ్యవధిలో 150కు పైగా కల్యాణాలను తి.తి.దే అద్భుతంగా నిర్వహించిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేదిక అలంకరణలకు విరాళాలు ఇస్తున్నారన్నారు. అంతేకాని ఎక్కడా అవకతవకలకు చోటివ్వడం లేదన్నారు.
ఇదే రీతిలో రాష్ట్రంలో యజ్ఞయాగాదులకు నోచుకోని అనేకానేక ప్రసిద్ధ దేవాలయాల్లో నెలకు ఒక ఆలయం చొప్పున వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తూ యజ్ఞహోమాదులను చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా శ్రీకూర్మం, యాదగిరిగుట్ట, పెంచలకోన వంటి దేవాలయాల్లో ఈ యాగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. వైదిక సంప్రదాయాన్ని కాపాడడమే ధ్యేయంగా తి.తి.దే చేస్తున్న ఈ కార్యక్రమాలను భక్తులు ఆదరించాలని ఆయన కోరారు.
కాగా మే 12 నుండి 18 వరకు శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు విద్యార్థుల కొరకు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ శిక్షణా తరగతులలో 16000 మందికి పైగా విద్యార్థులు పాల్గొననున్నారన్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా విద్యార్థులున్నప్పుడు ఈ సంఖ్య చాలా తక్కువన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని నేటితరం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు, యువతకు ప్రభోదించే హైంధవ ధర్మ సూక్ష్మాలు, నైతిక-ఆధ్యాత్మిక జీవన విధివిధానాలు వారికే కాకుండా సమగ్ర దేశాభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడుతాయన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.