ENDOWMENTS MINISTERS LAUDS TTD’s TEMPLE MANAGEMENT _ తితిదే ఆలయాల నిర్వహణ అత్యుత్తమం: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ రామచంద్రయ్య
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తితిదే ఆలయాల నిర్వహణ అత్యుత్తమం: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ రామచంద్రయ్య
తిరుపతి, మే 6, 2013: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తితిదే ఆలయాల నిర్వహణ అత్యుత్తమంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌ|| శ్రీ సి.రామచంద్రయ్య కొనియాడారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో సోమవారం తితిదే అధికారులతో మంత్రివర్యులు సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజూ వేల సంఖ్యలో వచ్చే భక్తులకు దర్శనం, అన్నప్రసాద వితరణ, ప్రసాదాల పంపిణీ, క్యూలైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలు కల్పించేందుకు తితిదే విశేషంగా కృషి చేస్తోందన్నారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో ఏవైనా పొరబాట్లు జరిగితే వెంటనే సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలందించేందుకు కృతనిశ్చయంతో పనిచేస్తూ భక్తుల మన్ననలు అందుకోవడం శ్లాఘనీయమన్నారు. ముగిసిన కేంద్రీయ ధార్మిక సలహామండలిని చట్టప్రకారం తిరిగి పునరుద్ధరించేందుకు వీలు కాదని, దాని స్థానంలో ‘సనాతన ధర్మప్రచార సదస్సు’ను ఏర్పాటు చేయాలని తితిదే పాలకమండలికి సూచించారు. తితిదేలో చేస్తున్న ఖర్చు హేతుబద్ధంగా ఉండాలని, రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చును తగ్గించుకోవాలని ఈవోను ఆదేశించినట్లు తెలిపారు. వార్షిక తనిఖీపై తీసుకున్న చర్యలతో రూపొందించిన నివేదికను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తుండడం వల్ల వారికి అవసరమైన సమాచార కరదీపికలను వివిధ భాషల్లో ముద్రించి అందుబాటులో ఉంచాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ధర్మప్రచారమే ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్ ప్రసారం చేసే కార్యక్రమాలు సృజనాత్మకంగా ఉండి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిలకించి సంతృప్తి చెందేలా రూపొందించాలని మంత్రి సూచించారు. తితిదే ఉత్సవాలు, కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లోని భక్తులు తిలకించేందుకు వీలుగా ఆయా భాషల్లో ప్రసారం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ దేవాలయాల ప్రధాన ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఎస్వీబీసీ కార్యక్రమాలను భక్తులకు మరింత చేరువ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రధాన ఆలయాలన్నింటినీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా అనుసంధానించి హైదరాబాదులోని స్టూడియోను అభివృద్ధి చేయాలని సూచించారు.
చాలా ఏళ్లుగా ఉన్న తితిదే అటవీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు పాలకమండలి దృష్టికి తీసుకెళ్లాలని కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యంను ఆదేశించారు. వకుళామాత ఆలయ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, ఆ విషయంపై చర్చించడం సరికాదన్నారు. తిరుమల నిర్వాసితులకు వీలైనంత ఎక్కువ సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పుణ్యక్షేత్రాల్లో, పవిత్ర స్థలాల్లో జరిగే చిన్న చిన్న పొరబాట్లను మీడియా పెద్దదిగా చూపరాదని, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందని పాత్రికేయులను కోరారు. ఉదాహరణకు తిరుమలలోని అన్నప్రసాద భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కేవలం కొన్ని గోనె సంచులు మాత్రమే కాలాయని, పలు ఛానళ్లు దీన్ని పెద్ద అగ్నిప్రమాదంగా చిత్రించడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వార్తా కథనాల ద్వారా భక్తులకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమీక్షలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎం.జి.గోపాల్, కమిషనర్ శ్రీ జి.బలరామయ్య, తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.