EVENING VAHANAMS PROVIDES SOOTHING EYE FEAST TO DEVOTEES _ తిరుమలలో వైభవంగా రథసప్తమి
తిరుమలలో వైభవంగా రథసప్తమి
వాహనసేవలు తిలకించేందుకు లక్షలాదిగా విచ్చేసిన భక్తులు
తిరుమల, 2025 ఫిబ్రవరి 04: సూర్య జయంతిని పురస్కరించుకొని మంగళవారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ రంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రథసప్తమిని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు. ఈ వాహనసేవలతోపాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించారు.
సూర్యప్రభ వాహనం
అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు జరిగింది. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.
చిన్నశేష వాహనం
ఉదయం 9 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
గరుడ వాహనం
ఉదయం 11 నుండి 12 గంటల వరకు గరుడ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చాడు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంకృతుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించాడు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది గరుడ వాహనం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.
హనుమంత వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగి ఆశీర్వదించాడు. హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
చక్రస్నానం
రథసప్తమి సందర్భంగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల నడుమ చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీవరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.
కల్పవృక్ష వాహనం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.
సర్వభూపాల వాహనం
సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.
చంద్రప్రభ వాహనం
రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులను కటాక్షించారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి , పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ ఎన్.సదాశివరావు, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ నరేష్ , శ్రీ శాంతా రామ్, శ్రీ రాజశేఖర్ గౌడ్, శ్రీమతి రంగశ్రీ, శ్రీమతి జానకి దేవి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, సీవీఎస్వో శ్రీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.