GODDESS OF RICHES BLESSES ON SAPTHA VAHANAS _ సప్త వాహనల్లో సిరులతల్లి అభయం
సప్త వాహనల్లో సిరులతల్లి అభయం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 04 ; తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.
ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ, గజ వాహనంపై దర్శనమివ్వనున్నారు.
శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్కభజనలు, భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుభాష్ ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.