GOVINDARAJA SWAMY BLESSES DEVOTEES ON PEDDASESHA VAHANAM _ వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత గోవిందుడు

Tirupati, May 23, 2026: Sri Govindaraja Swamy, along with Sridevi and Bhudevi, blessed devotees on Pedda Sesha Vahanam on the first night of the annual Brahmotsavams in Tirupati on Friday.

Amid Mangala Vadyams, Kolatams, Chekka Bhajans and chants of Govinda Namam, the deity majestically paraded through the four Mada Streets, mesmerizing devotees with divine splendour.

Devotees offered coconuts and Harathis with deep devotion, while the spiritually vibrant atmosphere turned the temple streets into a sea of bhakti.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

వైకుంఠనాధుడి అలంకారంలో భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత గోవిందుడు

గోవింద నామస్మరణలతో మారుమోగిన తిరుపతి మాడవీధులు

మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనల నడుమ వైభవమైన పెద్దశేష వాహనసేవ

భక్తి తరంగాల్లో తేలియాడిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2026 మే 23: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై వైకుంఠనాధుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు దివ్య మంగళ విహారం చేసి భక్తులను అనుగ్రహించారు.

ఆదిశేషునిపై శేషశాయిగా వెలసిన స్వామివారు అపూర్వ దివ్యకాంతులతో భక్తులను పరవశింపజేశారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుండగా మంగళవాయిద్యాలు, కోలాటాలు, చెక్కభజనలు, గోవింద నామస్మరణల నడుమ స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు.

అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు సమర్పిస్తూ, కర్పూర హారతులు ఇస్తూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించుకున్నారు. గోవింద నామాలతో మారుమోగిన మాడవీధులు ఆధ్యాత్మిక పారవశ్యానికి నిలయంగా మారాయి.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రంగా సేవలందిస్తూ “శేషశాయి” మహిమను సార్థకం చేస్తున్నాడు. శేషవాహన సేవ ద్వారా “శేషునిలా నిత్యం భగవంతునికి సేవ చేస్తూ ధర్మమార్గంలో నడిచే వారికి దైవానుగ్రహం లభిస్తుంది” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని స్వామివారు భక్తులకు బోధిస్తున్నారని ఆగమ పండితులు తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండోవ రోజు ఆదివారం ఉదయం 7 గం.లకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గం.లకు హంస వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయరావు, శ్రీ రంజిత్‌, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది