GRAND ANNUAL BRAHMOTSAVAMS OF SRI GOVINDARAJA SWAMY FROM MAY 23 _ వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, May 16, 2026: TTD EO Muddada Ravi Chandra unveiled the invitation posters of the annual Brahmotsavams of Sri Govindaraja Swamy Temple on Saturday.
The Brahmotsavams will be held from May 23 to 31 with spiritual grandeur and elaborate arrangements for devotees. Garuda Seva on May 27 and Rathotsavam on May 30 will be the major attractions.
The EO instructed officials to ensure smooth arrangements, decorative illumination, flower decorations, LED displays and devotee-friendly facilities during the festival.
Daily Vahana Sevas and spiritual cultural programmes will also be organised throughout the Brahmotsavams.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవోపేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర
ఆధ్యాత్మిక శోభ కనిపించేలా ఏర్పాట్లు
మే 27న గరుడ సేవ – మే 30న రథోత్సవం
తిరుపతి, 2026 మే 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా, మరింత ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్వహించనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను టిటిడి జేఈవో లు శ్రీ వి వీరబ్రహ్మం, డా. ఎ.శరత్, సివిఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ లతో కలిసి టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర శనివారం ఆవిష్కరించారు.
తిరుపతిలోని టీటీడీ నివాస గృహంలోని ఈవో ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో విశేష ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళ కళ లాడేలా చలువ పందిళ్లు, ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, రంగురంగుల ముగ్గులు, పుష్పాలంకరణలు, వైట్ పెయింటింగ్, సాంప్రదాయ చిత్రకళా అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.
మే 22న సాయంత్రం 5.30 గంటల నుండి 8 గంటల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మే 23న ఉదయం 7.35 గంటల నుండి 8.49 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్న వాహనసేవలు భక్తి పారవశ్యాన్ని పంచనున్నాయి. ముఖ్యంగా మే 27న గరుడవాహన సేవ, మే 30న రథోత్సవం బ్రహ్మోత్సవాలకు ఆకర్షణగా నిలవనున్నాయి.
వాహనసేవల విశేషాలు
24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం
26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం
27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం
28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం
29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం
30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం
31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


