IMPORTANT POINTS OF TTD TRUST BOARD MEETING _ తి.తి.దే పాలకమండలి సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు
తి.తి.దే పాలకమండలి సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు
తిరుమల, 15 మే 2013: తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారంనాడు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులైన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ ఎం.జి.గోపాల్, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ బలరామయ్య, తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, జె.ఇ.ఓలు శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
పాలకమండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
1. తిరుమల పుణ్యక్షేత్ర పవిత్రత దృష్ట్యా ఏవిధంగానైతే తిరుమల పంచాయితీ పాలనా వ్యవస్థ తితిదే కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలోనికి తీసుకొనిరాబడినదో అదే రీతిలో శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతీ దేవేరి వెలసియున్న తిరుచానూరు పుణ్యక్షేత్రాన్ని కూడా నిర్ణీత పరిధి మేరకు తితిదే ఆధ్వర్యంలో తీసుకురావడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి నిర్ణయం.
2. నాణ్యతమైన నెయ్యిని ఉత్పత్తి అయిన అనతికాలములోనే ప్రసాద తయారీకి వినియోగించుకునేందుకు ప్రత్యేకమైన విధి విధానాల రూపకల్పనకు ఆమోదం.
3. శ్రీకాళహాస్తి, భద్రాచలం, పెంచలకోన, అరసవెల్లి, మహానంది వంటి పుణ్య క్షేత్రాలలో యాత్రిక వసతి సముదాయ నిర్మాణానికి నిర్ణయం.
4. అంతరించి పోతున్న అత్యంత ప్రసిద్ధ వస్త్రకళ అయిన కలంకారిని తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకునిరావడంలో భాగంగా త్వరలో తితిదే శిల్పకళ సంస్థ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల ప్రత్యేక కోర్సు ప్రవేశపెట్టడానికి కీలక నిర్ణయం. ఈ మేరకు కమీషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారికి ప్రతిపాదనలు పంపిన తితిదే.
5. తిరుమల, గోవిందరాజస్వామి వారి ఆలయంలో పని చేస్తున్న వయస్సు మీరిన అర్చకులకు విశ్రాంత భృతిని అందించడానికి నిర్ణయం.
6. ఇకపై రాష్ట్ర రైస్‌మిలర్స్ అసోసియేషన్ నిర్ణయించిన రు.39 కిలో ధరకే సోనా మసూరి బియ్యం ఖరీదు.
7. ఉత్తరప్రదేశ్ లోని నైమిసారణ్యంలో రు.90 లక్షలతో శ్రీవారి ఆలయ నిర్మాణం. జూన్ 4వ తారీఖున కన్యాకుమారిలో రు.22 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల ప్రారంభం. మే 29వ తారీఖున ఢిల్లీలో శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవం, జూన్ 1వ తారీఖున ఢిల్లీలోని వేంకటేశ్వర కళాశాలలో శ్రీనివాస కళ్యాణం.
8. తిరుమలలో ఆక్టోఫస్ బలగాల శిక్షణాకేంద్రం ఏర్పాటుకు ఒక ఎకరా స్థలము కేటాయింపు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.