IMPORTANT POINTS OF TTD TRUST BOARD MEETING _ తి.తి.దే పాలకమండలి సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు
తి.తి.దే పాలకమండలి సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు
తిరుమల, 15 జూన్ 2013 : తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారంనాడు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులైన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శ్రీ ఎం.జి.గోపాల్, దేవాదాయ శాఖ కమీషనర్ డా|| కిషోర్, తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, జె.ఇ.ఓలు శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
పాలకమండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
1. ఆలయ నిర్వహణలో ప్రధాన భూమికను పోషిస్తున్న ఆగమాలకు ఎటువంటి విఘాతం కలుగకుండా కార్యకలాపాలు కొనసాగించే విధంగా ముగ్గురు నిష్ణాతులైన ఆగమ పండితులతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రెండు ఏళ్ళ కాలపరిమితి మేర నియామకానికి అమోదం. వీరిలో శ్రీ శ్రీనివాసాచార్యులు ప్రస్తుతం పాంచారాత్ర ఆగమ పండితులుగా అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తుండగా మిగిలిన ఇరువురు శ్రీకాకుళానికి చెందిన శ్రీ చమర్తి జగ్గప్పాచార్యులు మరియు గుంటూరుకు చెందిన వేదాల వేంకటసీతారామాచార్యులు. వీరు ఇరువురుకి కనీస గౌరవ వేతనం రూ.6 వేలుగా నిర్ణయించడమైనది.
2. గుంటూరులోని జిల్లలమూడి ప్రాంతంలో మాతృశ్రీ అనుసూయా దేవి సేవలకు గుర్తుగా అక్కడి భక్తుల కొరకు వారి కోరిక మేరకు 4 వేల మందికి సరిపడా అన్నప్రసాద భవనాన్ని నిర్మించి ఇవ్వడానికి బోర్డు నిర్ణయం. ఈ మేరకు ఒక కమిటీని తి.తి.దే ఏర్పాటుచేసి భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులను వచ్చే బోర్డు సమావేశం లోపు సమర్పించవలసిందిగా ఆదేశించడమైనది. (కాగా మతృశ్రీ అనసూయ తెనాలి బాపట్లలో 40 ఏళ్ళుగా భక్తులకు అన్నప్రసాద వితరణను చేసి 1985లో పరమపదించిన మహాసాధ్వి.)
3. తిరుమల, తిరుపతి, తదితర తి.తి.దే అనుబంధ ఆలయాల్లో భద్రతా వ్యూహాన్ని మరింత పటిష్టం కావించడంలో భాగంగా త్వరలో రూ. 62 కోట్లతో 1750 సి.సి. కెమరాల కొనుగోలుకు నిర్ణయం. ఈ మేరకు భద్రతా విభాగం ఆంతరంగిక సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీ రామకృష్ణ ప్రతిపాదనలను హెచ్.సి.ఎల్. కంపెని వారి సహకారంతో నిర్దేశిత ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ మేరకు ఈ ప్రణాళికను త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, కేంద్రహోంశాఖ కార్యదర్శి, ఇతర భద్రతా మరియు నిఘా సంస్థల అధికారులతో సమావేశమై చర్చించనున్నామన్నారు. ఎవరైనా భద్రతా విభాగంలో అనుభవమున్న దాతలు ముందుకు వస్తే ఈ పరికరాలను కొనుగోలు చేయడానికి నిర్ణయం.
4. తి.తి.దే ఆస్థాన విద్వాంసురాలిగా ప్రముఖ వాయులీన విధ్వాంసురాలు కలైమామణి కుమారి కన్యాకుమారిని 5 ఏళ్ళ కాలపరిమితితో నియమిస్తూ నిర్ణయం.
5. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు పాలు, మజ్జిగ సంవత్సరం పూర్తి అందించడానికి రూ. 8,18,68,500లతో టెండర్లు ద్వారా కొనుగోలు చేయడానికి నిర్ణయం. (కాగా 35 లక్షల లీటర్ల పాలు-రూ.22.25 పైసలు ఒక లీటరు, 10వేల కిలోల పెరుగు – రూ. 24.35 పైసలు ఒక కిలో, మజ్జిగ 3 లక్షల లీటర్లు – రూ.12.50 పైసలు ఒక లీటరు ధరగా నిర్ణయించడమైనది)
6. తిరుచానూరు చెంత ఉన్న 5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయాన్ని, కల్యాణ నిర్వహణ భవంతిని నిర్మించడానికి రూ.68 కోట్లు మంజూరుకు ఆమోదం.
7. ప్రస్తుతం అమలులో ఉన్న సాయంత్రం వి.ఐ.పి విరామ దర్శనం రద్దు విధానం కొనసాగింపునకు నిర్ణయం. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత, వచ్చే బోర్డు సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం.
వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తి.తి.దే ఛైర్మెన్ పరిశీలన
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు శనివారంనాడు బియ్యాన్ని పరిశీలించారు. గత బోర్డు సమావేశంలో రాష్ట్ర బియ్యంమిల్లర్ల సమాఖ్య నుండే నాణ్యత కల్గిన బియ్యాన్ని కొనుగోలుచేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు కూడా అన్నప్రసాదం రుచి ద్విగుణీకృతమైందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.