JYESTABHISHEKAM COMMENCES _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

Tirumala, 09 June 2025: The annual Jyestabhishekam commenced on a grand religious note in Tirumala temple on Monday.

In the morning, Snapana Tirumanjanam was performed to the Utsavam deities while in the evening, the precious diamond-studded armour was adorned to Sri Malayappa Swamy.

Later the utsava deities blessed the devotees in the Vajra Kavacha which happens once in a year.

TTD Addl EO Sri C.H. Venkayya Chowdhury, DyEO Sri Lokanatham and others were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
 
తిరుమల, 2025 జూన్ 09: తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జ్యేష్టమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్లుగా ప్రతి సంవత్సరం మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు 1990వ సంవ‌త్స‌రంలో ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఋత్వికులు శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు.
 
వ‌జ్ర క‌వ‌చంలో స్వామివారు ద‌ర్శ‌నం
 
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఇదిలా ఉండగా మంగళవారం ముత్య‌పు కవచంతో, బుధవారం స్వర్ణ కవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.
 
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.