JYESTABHISHEKAM IN TIRUMALA FROM JUNE 20-22 _ తిరుమలలో జూన్ 20 నుండి 22 వరకు అభిద్యేయక జ్యేష్ఠాభిషేకం
తిరుమలలో జూన్ 20 నుండి 22 వరకు అభిద్యేయక జ్యేష్ఠాభిషేకం
తిరుమల, 19 జూన్ 2013 : ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠానక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజులపాటు తిరుమల శ్రీవారికి జరిగే జ్యేష్ఠాభిషేకం, సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో ఈ నెల జూన్ 20వ తేది నుండి 22వ తేది వరకు జరుగనుంది. దీనినే ”అభిద్యేయక అభిషేకం” అని కూడా అంటారు.
ఈ ఉత్సవ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జూన్ 20వ తారీఖున నిర్వహించే ఆర్జితసేవలైన తిరుప్పావడ మరియు వసంతోత్సవ సేవలను తి.తి.దే రద్దుచేసింది. అదే విధంగా జూన్ 21వ తేదిన నిజపాద దర్శనం మరియు వసంతోత్సవాలను తి.తి.దే రద్దు చేసింది. ఇక చివరిరోజైన జూన్ 22వ తేదిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జి బ్రహ్మోత్సవం మరియు వసంతోత్సవాలను తి.తి.దే రద్దు చేసింది. కాగా తోమల, అర్చన వంటి సేవ టికెట్లకు సంబంధించి ‘డిస్క్రిషనరి’ కోటాను మాత్రమే తి.తి.దే రద్దు చేసింది.
కాగా తరతరాలుగా అభిషేకాదులతో అత్యంత ప్రాచీనములైన శ్రీ స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం ఏర్పాటుచేసిన ఉత్సవమే ఇది.
మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు అభిషేకాలు పంచామృత స్నపన తిరమంజనాదులు నిర్వహించిన తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు.
యథాప్రకారంగా రెండవరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగిస్తారు. మూడవరోజు కూడ తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు చేస్తారు. ఈ బంగారు కవచ సమర్పణ మళ్ళీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంత వరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే ఉంటారు.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొంటారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.