KALYANA VENKATESWARA SWAMY BLESSES DEVOTEES ON HANUMANTHA VAHANAM _ హనుమంత వాహనంపై కల్యాణ వేంకటేశ్వరుని అభయహస్తం

Tirupati, June 02, 2026: As part of the annual Brahmotsavams at Narayanavanam, Sri Kalyana Venkateswara Swamy, along with Sri Padmavati Ammavaru, blessed devotees on Hanumantha Vahanam on Tuesday morning.

The procession was held grandly amid devotional bhajans, kolatams, and Govinda namasmarana. The Vahana Seva highlighted the virtues of devotion, strength, courage, and surrender symbolized by Lord Hanuman.

Later, Snapana Tirumanjanam was performed to the Utsava deities with milk, curd, honey, sandal paste, and coconut water.

Vasanthotsavam will be held in the evening, followed by a procession on Golden Tiruchi. Gaja Vahanam Seva is scheduled at 7 p.m.

TTD officials, temple priests, Srivari Sevaks, and a large number of devotees participated.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై కల్యాణ వేంకటేశ్వరుని అభయహస్తం

భక్తి, శక్తి, శరణాగతికి ప్రతీకగా దివ్యమంగళ విహారం

చెక్కభజనలు, కోలాటాలతో మారుమోగిన నారాయణవనం

గోవింద నామస్మరణతో పరవశించిన భక్తజనం

తిరుపతి, 2026 జూన్ 02: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం హనుమంత వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 7.30 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు హనుమంత వాహనంపై దివ్యమంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు.

భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ భక్తిరసపూరితంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద నామస్మరణలతో స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

హనుమత్సేవా మహిమను చాటిన స్వామివారు

త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి పరమభక్తుడిగా నిలిచిన ఆంజనేయస్వామి భక్తి, శక్తి, ధైర్యం, శరణాగతికి ప్రతీకగా పురాణాల్లో వర్ణించబడ్డాడు. బుద్ధి, బలం, ఆరోగ్యం, నిర్భయత్వం, వాక్పటిమ హనుమత్స్మరణ ద్వారా సిద్ధిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో హనుమంత వాహనంపై విహరించిన స్వామివారు భక్తులకు శరణాగతి మహిమను చాటిచెప్పారు.

వైభవంగా స్నపన తిరుమంజనం

అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామివారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు సమర్పించారు.

సాయంత్రం వసంతోత్సవంరాత్రి గజవాహన సేవ

మధ్యాహ్నం 4 గంటలకు వసంతోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది