MAHASAMPROKSHANA FETE AT VONTIMITTA TEMPLE _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణకు అంకురార్పణ
శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణకు అంకురార్పణ
ఒంటిమిట్ట / తిరుపతి, 2025 మార్చి 05: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ మరియు కుంభాభిషేకంకు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
మహా సంప్రోక్షణ సందర్భంగా ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి బంగారు ఆభరణాలు, పుష్పమాలతో అలంకరించి విష్వక్సేన పూజ, యజమాన సంకల్పం, ఆచార్య రుత్విక్ వరణంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆగమ సలహాదారులు మరియు ప్రధాన కంకణబట్టర్ శ్రీ రాజేష్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
సాయంత్రం 5.30 గంటలకు ఆలయంలో విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, పంచగవ్య ప్రోక్షణము, ధ్వజ కుంభారాధనములు, మృత్సంగ్రహణము, అంకురార్పణం నిర్వహించారు.
ఆలయ విమాన గోపురానికి రూ. 43 లక్షలతో నూతనంగా తయారు చేసిన స్వర్ణ కళశానికి యాగశాలలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.