NARAYANAVANAM FETE POSTERS RELEASED నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

TIRUPATI, 05 MAY 2025: The wall posters regarding the annual brahmotsavams in Narayanavanam are released on Monday.

As the big religious fete is scheduled from May 10-19, the posters were released by TTD JEO Sri Veerabrahmam at his chambers in the TTD Administrative building in Tirupati.

DyEO Smt Nagaratna, AEO Sri Ravi Kumar were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

తిరుప‌తి, 2025 మే 05: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, క‌ర‌ప‌త్రాల‌ను టీటీడీ జెఈవో శ్రీ వి.వీర‌బ్ర‌హ్మం ఆవిష్కరించారు. టీటీడీ పరిపాలనా భవనంలో గల జేఈవో కార్యాలయంలో సోమ‌వారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ మే 11 నుండి 19వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. మే 6న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 10న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వ‌హిస్తారని చెప్పారు.

ఆలయ నేపథ్యం:

శ్రీ ఆకాశ మహారాజు నారాయణవనమును కేంద్రంగా చేసుకుని పాలించు చుండెను. వారు సంతానార్థియై పుత్రకామేష్టి యాగము చేయ సంకల్పించి, యాగ స్థలమును స్వర్ణ హలముతో దున్నుతున్న తరుణమున ఒక మందసము నందు పద్మముపై పడుకొన్న చందమున ఒక ఆడ శిశువు లభించింది. ఆ శిశువు పద్మోద్భవిగా తలచి పద్మావతి అను నామ ధేయము చేసి రాజు గారు ఆమెకు విద్యాబుద్ధులు నేర్పి, దిన దిన ప్రవర్థమానురాలుగా చేయసాగెను.

శ్రీ పద్మావతి దేవి యుక్త వయస్సు సమయములో ఒకనాడు తన చెలికత్తెలతో వన విహారము చేయు సందర్భమున వైకుంఠపతియైన శ్రీ శ్రీనివాసుడు వేట మార్గమున వచ్చుచుండగా ఆమెను చూచి, మోహించి, ఆమెని ఆకాశరాజు అనుమతితో సకల దేవతల సమక్షమున విళంబి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శుక్లదశమి, శుక్రవారం వివాహం చేసుకొనెను. వారి జ్ఞాపకార్థం శ్రీ ఆకాశ మహారాజు నారాయణవనమున ఆలయ నిర్మాణం గావించి, వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కైంకర్యాలు జరుపుటకు ఏర్పాటు చేసినారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు అర్చావతారియై, వృక్ష స్థలమున లక్ష్మీదేవి, దశావతార వడ్డ్యాణం, వేట ఖడ్గం, దక్షిణ హస్తమున కల్యాణ కంకణధారియై, నేత్ర దర్శనముతో వేంచేసి యున్నారు.

ఈ ఆలయ ఆకాశరాజు పరిపాలన అనంతరం, కార్వేటినగరం సంస్థానాధీశుల ద్వారా నిర్వహించబడి, తదనంతరం 09-04-1967 సంవత్సరం నుండి టిటిడిలోకి చేర్చబడి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవాలతో విలసిల్లుతున్నది.

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

11-05-2025 ధ్వజారోహణం, పెద్దశేష వాహనం.

12-05-2025 చిన్నశేష వాహనం, హంస వాహనం.

13-05-2025 సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం.

14-05-2025 కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం.

15-05-2025 మోహినీ అవతారం, గరుడ వాహనం.

16-05-2025 హనుమంత వాహనం, గజ వాహనం.

17-05-2025 సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.

18-05-2025 రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం.

19-05-2025 చక్రస్నానం, ధ్వజావరోహణం.

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 18వ తేదీ రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ రవి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.